కాంగ్రెస్ అడ్డగోలు హామీలు ఇచ్చిందని మరో జన్మ ఎత్తినా వాటిని అమలు చేయడం సాధ్యం కాదని మల్కాజిగిరి బీజేపీ లోక్ సభ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. ఆదివారం మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఇందు ఫార్చ్యూన్ విలాస్ లో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఈటల పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ హామీలు ఇస్తుంటే ఆర్థిక మంత్రిగా పని చేసిన వ్యక్తిగా వీటి అమలు సాధ్యం కాదని తాను మొత్తుకున్నానని తాజా మాజీ ఆర్థిక మంత్రి హరీశ్ రావు కూడా కాంగ్రెస్ హామీలు అమలు చేస్తే రాజీనామా చేస్తానని చాలెంజ్ చేస్తున్నారు ఆ స్థాయికి పరిస్థితి ఎందుకు వచ్చిందో ఆలోచించాలన్నారు.
కాంగ్రెస్ హామీలు అమలు జరగాలంటే రూ.2 లక్షల కోట్లు కోవాలని కానీ రాష్ట్రంలో అదనంగా రూ.5 వేల కోట్లు కూడా ఖర్చుపెట్టలేని పరిస్థితి ఉందన్నారు. ఆలాంటప్పుడు కాంగ్రెస్ హామీల అమలు ఎలా సాధ్యమో ఆలోచించాలన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ జై శ్రీరామ్ పేరుతో ఓట్లు అడుగుతున్నారంటూ ప్రత్యర్థులు చేస్తున్న విమర్శలకు ఈటల కౌంటర్ ఇచ్చారు. మోడీ అభివృద్ధిపేరుతో ఓట్లు అడుగుతున్నారే తప్ప కేవలం జై శ్రీరామ్ పేరుతో ఓట్లు అడుగుతున్నారనేది తప్పు అన్నారు. ఎవరైనా సరే కళ్లు నెత్తికెక్కిమాట్లాడకూడదని, మన పరిధి, మన స్థాయిని మించి మాట్లాడితే ప్రజలు గమనిస్తున్నారనే సోయి ఉండాలని హెచ్చరించారు.కేంద్రంలోని మోడీ ప్రభుత్వం నాలుగు కోట్ల మందికి ఇండ్లు కట్టించిందని బీఆర్ఎస్ ప్రభుత్వంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కల్పన గురించి గొప్పగా చెప్పిన కేసీఆర్ ఇళ్లను మాత్రం ఎక్కడా కట్టలేదని ఆరోపించారు. కేంద్రం 2 లక్షల 53వేల ఇస్తే కట్టినం అని చెప్పినవి 1 లక్ష 75 వేల ఇండ్లు అయితే పంచినవి 40 నుంచి 50 వేలు మాత్రమేనని విమర్శించారు.