నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, జూన్ 22 (ప్రభ న్యూస్) : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పాలనలో రాక్షస పాలన సాగుతుందని బీఆర్ఎస్ మాజీమంత్రులు సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డి ధ్వజమెత్తారు. కొల్లాపూర్ నియోజకవర్గంలోని మలచింతలపల్లిలో ఉంటున్న ఆదివాసి ఈశ్వరమ్మపై ముగ్గురు మృగాలు పాశవిక దాడికి గురవడంతో నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు.
ఆ బాధితురాలని పరామర్శించేందుకు మాజీ మంత్రులు ఆస్పత్రికి వచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ … రాజకీయాలకు అతీతంగా ఆదివాసి ఆడబిడ్డపై జరిగిన హేయమైన చర్యకు మానవత దృక్పథంతో స్పందించి.. చర్యకు పాల్పడిన వారిని అదుపులోకి తీసుకొని శిక్షించాల్సిన అవసరముందన్నారు.
కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు మహిళలపై గౌరవం ఉంటే వారిని వెంటనే చట్ట పరంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బాధితురాలు కుటుంబానికి రక్షణ కల్పిస్తూ ఎక్స్ గ్రేషియా కింద రూ.50 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇకపై ఇలాంటి ఘటనలు జరగకుండా పోలీస్ యంత్రాంగాన్ని బలోపేతం చేసి ఆడబిడ్డలకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.