కుటుంబ సభ్యుల ఆందోళన
కోరుట్ల టౌన్, ఆంధ్రప్రభ : వారం రోజుల క్రితం తన ముగ్గురు పిల్లలతో సహా భార్య అదృశ్యమైన సంఘటన జగిత్యాల జిల్లా కోరుట్లలో సంచలనంగా మారింది. పట్టణంలోని బాలాజీ రోడ్డుకు చెందిన కేలేటి మహితశ్రీ తన ముగ్గురు పిల్లలతో సహా అదృశ్యమైంది. ఆమెను ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటారా..? లేదా ఎవరితోనైనా వెళ్లిందా..? అనే ఈ విషయం పోలీస్ అధికారులకు సవాల్‌గా మారింది.
ముగ్గురు పిల్లలతో కలసి కనిపించక పోవటంతో వారు ఏమై ఉంటారని, ఎక్కడికి వెళ్లారని కుటుబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయమై స్థానిక పోలీస్ స్టేషన్ లో వారంరోజుల క్రితమే ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. అయినా ఇప్పటికీ పోలీస్ అధికారులు గాలింపు చర్యలు తప్ప వెతికి పట్టుకోవడం లేదని విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఇకనైనా దర్యాప్తు వేగవంతం చేసి పట్టుకోవాలని అంటున్నారు.
గాలింపులో జాప్యమా..?
సాంకేతిక రంగం ఎంతో అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో కనిపించకుండా పోయిన వారిని పట్టుకోవడంలో అధికారులు జాప్యం ప్రదర్శిస్తున్నారా.. ఇతర కేసుల్లో నేరస్తులను పట్టుకునేందుకు వారు వినియోగించిన సెల్ ఫోన్ల ద్వారా వారు ఉన్న ప్రదేశాన్ని ట్రేస్ చేసి పట్టుకుంటారు. కానీ కనిపించకుండా పోయిన మహిత శ్రీ విషయంలో ఆమె సెల్ ఫోన్‌ను ట్రేస్ చేయలేకపోయారా.. లేదంటే మహితశ్రీ తెలివిగా సాంకేతిక నైపుణ్యతకు చిక్కకుండా కొత్త సెల్‌ఫోన్, కొత్త సిమ్ కార్డు వినియోగిస్తుందా..? ఈ విషయాన్ని పోలీసులు కనుగొనే అవకాశం లేదా..? ఆ కోణంలో వేగవంతం చేస్తే ఆచూకీ లభ్యమయ్యే అవకాశం ఇక పోలేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
నా భార్య పిల్లలు ఎలా ఉన్నారో..
ముగ్గురు పిల్లలతో కలిసి తన భార్య మహితశ్రీ అదృశ్యం అవడంతో మహితశ్రీ భర్త రంజిత్ భార్య పిల్లలు ఏమయ్యారోనని కంటతడి పెట్టారు. ఎలాగైనా పోలీస్ ఉన్నతాధికారులు చొరవ తీసుకొని తన భార్య పిల్లలను సురక్షితంగా తీసుకురావాలని వేడుకుంటున్నాడు.