తెలంగాణ ప్రభుత్వం బిల్డర్స్‌ని, కాంట్రాక్టర్లుగా చూడడం లేదు. సంపద సృష్టించే సృష్టి కర్తలుగా చూస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాద్ లోని హైటెక్స్‌లో ఆదివారం జరిగిన బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా 31వ కన్వెన్షన్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కన్వెన్షన్ వద్ద ఏర్పాటు చేసిన వివిధ రకాల స్టాల్స్ ను పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. దేశంలోని నిర్మాణ రంగాల్లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల కాంట్రాక్టర్ల సహకారం ఎక్కువగా ఉందన్నారు. దేశ సంపదను సృష్టించడంలో ఇక్కడి బిల్డర్స్ కీలక భూమిక పోషిస్తున్నారని, ఇలాంటి బిల్డర్స్ ను ప్రోత్సహించడం ప్రభుత్వాల బాధ్యతని చెప్పారు. సంక్షేమ రాజ్యం తీసుకురావాలంటే సంపద కావాలి. సంపద సృష్టించే సంస్థలు రావాలి. అప్పుడే ప్రజల అవసరాలను ప్రభుత్వాలు తీర్చగలవు. సంపద సృష్టించేశక్తులను గాయపరిచే ఆలోచన ఇందిరమ్మ రాజ్యంలో ఉండబోదని డిప్యూటీ సీఎం విక్రమార్క వివరించారు.
నిర్మాణ రంగంలో విప్లవాత్మక మార్పులు..
నిర్మాణ రంగంలో వచ్చిన అనేక విప్లవాత్మక మార్పులతో దేశంలో నిర్మాణ రంగం చాలా ముందుకు దూసుకుపోతోందని డిప్యూటీ సీఎం భట్టి అన్నారు. మార్కెట్లో ఒక వెలుగు వెలిగిన సంస్థలు ఆర్థిక ఇబ్బందులతో నేడు కనుమరుగువుతున్నాయని పేర్కొన్నారు. బ్యాంకు గ్యారంటీ రుణాలు తీసుకుని పెట్టుబడి పెట్టిన సంస్థలకు సకాలంలో బిల్లులు రాకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఏర్పడుతున్నాయన్నారు. ఈ సమస్యను సాధ్యమైనంతవరకు కాంగ్రెస్ ప్రభుత్వం పరిష్కరిస్తుందని హామీ ఇచ్చారు. బిల్డర్స్ ను కాంట్రాక్టర్లుగా చూడటం లేదు, సంపద సృష్టికర్తలుగా చూస్తున్నాం. మిమ్మల్ని కాపాడుకొని ప్రోత్సహించే బాధ్యత మాది. స్వతహాగా నిర్మాణ రంగంలో రాణిస్తూ జాతి నిర్మాణానికి బిల్డర్స్ చేస్తున్న కృషిని అభినందిస్తున్నామన్నారు. హైదరాబాద్ చాలా అందమైన నగరం, తెలంగాణ రాష్ట్రం వాతావరణ పరంగా, ఆర్థికపరంగా, భాషా పరంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా దేశం నలుమూలల నుంచి ఇక్కడకు వచ్చి స్థిరపడి వ్యాపారాలు చేసుకోవడానికి అనువైన ప్రాంతమని వివరించారు. ఇలా తెలంగాణకు వచ్చి సంపద సృష్టించే వారికి కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు.