Saturday, November 23, 2024

TS | గ్యాంగ్ రేప్ కాదు, ఆత్మహత్య.. బాలిక మృతి కేసులో వీడిన మిస్టరీ

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ కేసు మలుపులు తిరిగింది. సిసి ఫుటేజీల్లో మృతురాలు ఇంటి నుండి పెద్దపల్లి పట్టణానికి అక్కడ నుండి తిరిగి ఇంటికి వెళ్లినట్టు ఆధారాలు లభించడంతో బాలిక పై ఏలాంటి అఘాయిత్యం జరగలేదని స్పష్టమైనది. పోలీసుల విచారణలో బాలిక ఎలుకల మందు తాగినట్టు సాక్షాధారాలు లభ్యమయ్యాయి. అందువల్లే బాలిక మృతి చెందినదని పోలీసులు అంచనాకు వచ్చారు.

బాలిక మృతదేహానికి శుక్రవారం హైదరాబాదులోని గాంధీ ఆసుపత్రిలో నిపుణులైన వైద్య బృందం పోస్ట్ మార్టం పూర్తి చేసింది. అయితే పోస్టుమార్టం లో ఆసక్తికర విషయాలు బయటపడినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. బాలిక మృతదేహంపై ఎలాంటి గాయాలు లేనట్టు వైద్యులు గుర్తించినట్లు తెలిసింది.

గ్యాంగ్ రేప్ జరిగిన ఆధారాలు వైద్యులు గుర్తించలేదని సమాచారం. సోమవారం రాత్రి పెద్దపల్లి మండలం అప్పన్నపేట శివారులోని రియల్ ఎస్టేట్ వెంచర్ లో మధ్యప్రదేశ్ కు చెందిన మైనర్ బాలికపై నలుగురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారని, బాలికకు తీవ్ర రక్తస్రావం కావడంతో మంగళవారం మధ్యప్రదేశ్ కు ప్రైవేట్ వాహనంలో తరలిస్తుండగా మృతి చెందిందన్న వార్తతో సంచలనం రేపింది.

- Advertisement -

బుధవారం రాత్రి సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. స్వయంగా రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి కేసును పర్యవేక్షించారు. దర్యాప్తు కోసం 12 పోలీసు బృందాలను ఏర్పాటు చేసి అనుమానితులు అందర్నీ అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించకుండా బంధువులను ఆదేశించి అదే రోజు అర్ధరాత్రి పెద్దపల్లి ఏసిపి మహేష్ ను మధ్యప్రదేశ్ కు పంపించారు. గురువారం మధ్యాహ్నం మధ్యప్రదేశ్ లోని మృతురాలి ఇంటికి చేరిన ఏసిపి మహేష్ బంధువులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. బంధువులు అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తుండగా, పోస్టుమార్టం కోసం వారిని ఒప్పించి మృతురాలు సోదరుడు ఇచ్చిన దరఖాస్తు తీసుకుని నలుగురిపై కేసు నమోదు చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో కేసు దర్యాప్తును పారదర్శకంగా నిర్వహించాలని బాలిక మృతదేహాన్ని హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రికి పోస్టుమార్టం కోసం తరలించారు. శుక్రవారం నిపుణులైన వైద్య బృందం బాలిక మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి చేశారు. బుధవారం రాత్రి నుండి పోలీసులు అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అన్ని వైపులా దర్యాప్తు చేపట్టారు.

సి సి ఫుటేజీల ఆధారంగా సోమవారం బాలిక తిరిగిన ప్రాంతాలను పరిశీలించగా మున్సిపల్ ఆఫీసు ఎదురుగా గల ఫెర్టిలైజర్ షాప్ లో ఎలుకల మందు కొనుగోలు చేసినట్టు కనుగొన్నారు.కొనుగోలు చేసిన ఎలుకల మందు సేవించడం వల్లే బాలిక మృతి చెందినట్లు నిర్ధారణకు వచ్చారు. గాంధీ ఆసుపత్రి వైద్యులు ఇచ్చే పోస్టుమార్టం ఆధారంగానే బాలిక మృతి పై పూర్తి స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement