రాజకీయాల్లో ఉత్తరాది ప్రాంతం నుంచి ఆధిపత్యం పెరిగిందని, దక్షిణాది వారికి పెద్దగా చాన్సెస్ ఉండడం లేదన్నారు ఉస్మానియా యూనివర్సిటీ ఫ్యాకల్టీ ఆఫ్ లా డీన్ ప్రొఫెసర్ గాలి వినోద్‌కుమార్. అందుకని ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వస్తానని, బీసీలు సీఎం కావడానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ఈ క్రమంలో ఇవ్వాల ఆయన మీడియాతో మాట్లాడారు.
స్వచ్ఛంద పదవీ విరమణ కోసం దరఖాస్తు చేసుకున్నారు ఓయూ ప్రొఫెసర్ గాలి వినోద్‌కుమార్. కాగా రాజకీయాల్లో దక్షిణాది వారికి అవకాశాల్లేకుండా పోతున్నాయని, ఉత్తరాది ప్రాంతం వారి పెత్తనం ఎక్కువవుతోందని అన్నారు. వచ్చే ఏడాది జనవరి ఒకటో తేదీ నుంచి విధుల నుంచి తప్పుకోనున్నట్లు తెలిపారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం దేశంలోని ప్రతి పౌరుడికి అందాలని రాజ్యాంగం చెబుతోందని.. దానిపై ప్రమాణం చేసి అధికారంలోకి వస్తున్న ప్రభుత్వాలు ఆ లక్ష్యాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు.
ఇక.. ఉత్తరాది ఆధిపత్యాన్ని దక్షిణాది నుంచి పారద్రోలేందుకు, 2023లో తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రిని చేసేందుకు తన ఎనిమిదేళ్ల సర్వీసును వదులుకుంటున్నానని తెలిపారు. తెలంగాణలో 50 శాతానికి పైగా ఉన్న బీసీలకు రాజ్యాధికారం దక్కాలని కోరుకుంటున్నట్టు తెలిపారు ప్రొఫెసర్ వినోద్‌కుమార్. సామాజిక తెలంగాణ సాధించేందుకు తన రాజీనామా దోహదం చేస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.