హైదరాబాద్ అతలాకుతలం
నిన్నటి నుంచి కుండపోత
రాత్రి నుంచి తెరిపివ్వని వాన
రహదారులు జలమయంరాకపోకలకు అంతరాయం
హైదరాబాద్‌లో ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది. నిన్న ఉదయం ప్రారంభమైన వర్షం తెరిపివ్వకుండా కురిసింది. రాత్రి పది గంటల నుంచి భారీగా వర్షం కురుస్తోంది. దీనికి తోడు ఈదురు గాలులు వీచాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దాదాపు అన్ని రహ దారులు జలమయం కావడంతో వాహన రాకపోకలకు అంతరాయం కలిగింది. ఈదురు గాలుల వల్ల ద్విచక్ర వాహనదారులు రోడ్డెక్కడానికి భయపడ్డారు. అత్యవసరం ఉంటే తప్పా ఎవరూ బయటకు రావడానికి సాహసించలేదు.
రహదారులు జలమయంనిన్నటి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు పలు ప్రాంతాల్లో రహదారులు జలమయమయ్యాయి. సికింద్రాబాద్, బోయిన్‌పల్లి, అల్వాల్, తిరుమలగిరి, చిలుకలగూడ, మారేడుపల్లి, ప్యాట్నీ, ప్యారడైజ్, బేగంపేట, బొల్లారం, జవహర్‌నగర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, ఖైరతాబాద్, అమీర్‌పేట, ఎస్‌ఆర్ నగర్, కూకట్‌పల్లి, కొండాపూర్, కొంపల్లి, హైదర్‌నగర్, ఆల్విన్‌కాలనీ, నిజాంపేట, హైదర్‌నగర్, ఆల్విన్‌కాలనీ, మెహిదీపట్నం, నాంపల్లి, మలక్‌పేట, దిల్‌సుఖ్‌నగర్, ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్‌నగర్, బీఎన్‌రెడ్డి, ఉప్పల్, ఈసీఎల్, సరూర్‌నగర్, సైదాబాద్, చంపాపేట్, మలక్‌పేట్ లో భారీగా వర్షం కురుస్తోందడడంతో రహదారులపై నీరు నిలిచిపోయింది.
ఇక రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీపట్నం, మంచాల, యాచారంలో తెరిపివ్వకుండా వానలు కురుస్తున్నాయి. చంపాపేట, రెడ్డి కాలనీతోపాటు పలు కాలనీల్లో రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోయాయి. దీంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.అప్రమత్తమైన అధికారులుహైదరాబాద్ సిటీలో బోరున వర్షం పడుతుండడంతో పోలీసులు, మునిసిపాలిటీ, రెస్క్యూ, రెవెన్యూ అధికారులు అప్రమతమయ్యారు. ఎక్కడ నీరు నిలిచిపోతే వెంటనే వాటిని తొలగిస్తున్నారు. వర్షపు నీటి వల్ల ప్రమాదాలకు గురికాకుండా పోలీసు యంత్రాంగం అప్రమత్తమయ్యారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు చర్యలు తీసుకున్నారు.
అత్యవసర పరిస్థితుల్లో ప్రజల ఫిర్యాదులు స్వీకరించేందుకు టోల్‌ఫ్రీ నంబర్లు ఏర్పాటు చేశారు. 040-2111 1111, డీఆర్‌ఎఫ్ నంబర్ 90001 13667 లో సంప్రదించాలని సూచించారు.
59 పునరావాస కేంద్రాలు…
భారీ వర్ష సూచనతో హైదరాబాద్ జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అధికారులను అప్రమత్తం చేశారు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, వాటర్ వర్క్స్, డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు క్షేత్ర స్థాయిలో అప్రమత్తంగా ఉండాలన్నారు. లోతట్టు ప్రాంతాల వారి కోసం హైదరాబాద్‌లో 59 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. వర్షాల నేపథ్యంలో హైదరాబాద్‌లో సోమవారం అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటించామని కలెక్టర్ తెలిపారు.
వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ అధికారులను కోరారు.
హైదరాబాద్‌లో రెడ్ అలర్ట్
హైదరాబాద్‌లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం పడుతోంది. ఈరోజు, రేపు హైదరాబాద్ లో అతిభారీ గా వర్షాలు పడే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. భారీ వర్షాలు కురిసే సమయంలో ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ రోజు రెడ్ అలర్ట్‌ను వాతావారణ శాఖ ప్రకటించింది.
జంట జలాశయాలకు భారీగా వరద
గ్రేటర్ హైదరాబాద్‌లో భారీగా వర్షం కురుస్తోంది. దీంతో జంట జలాశయాలు ఉస్మాన్‌సాగర్, హిమాయత్ సాగర్‌కు భారీగా వరద నీరు వచ్చి చేరుతున్నది. మూసీ నదికి వరద పోటెత్తింది. మూసారంబాగ్ బ్రిడ్జిని తాకుతూ వరద ప్రవహిస్తున్నది. హుస్సేన్ సాగర్‌లోకి పెద్దఎత్తున వరద వచ్చి చేరుతున్నది. దీంతో అధికారులు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.