Tuesday, November 26, 2024

ఎడతెగని కౌలు పంచాయితీ.. యాసంగి పైనా గందరగోళం..

బోధన్‌, (ప్రభన్యూస్‌): భూముల కౌలు ధరలు ఒక్కసారిగా డీలా పడ్డాయి. వర్షాకాలం పంటకు ముందు కౌలు భూములు దొరకని పరిస్థితులు ఉండగా, నేడు అందుకు భిన్నమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆరు నెలల్లో కాలం తారుమారైంది. కౌలుకు చేసేందుకు భూములు దొరకని పరిస్థితులు నుండి కౌలు భూములంటేనే భయపడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. వానకాలం పంటకు ముందు ఎకరం భూమికి కౌలు ధర 30 వేల పైనే పలుకగా, ఇప్పుడు మాకొద్దు కౌలు భూములు అంటూ కౌలు రైతులు డీలా పడ్డారు. దీనంతటికీ కారణం వరి ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసేందుకు వెనుకాముందు ఆడుతుండడమే అని చెప్పుకోవచ్చు. గతంలో ఎకరా భూమికి కౌలు వానకాలం, ఎండాకాలం రెండు పంటలకు గాను 20 వేల నుంచి 25 వేలు మాత్రమే పలికేది. అలాంటిది ఈ ఏడాది సమృద్దిగా వర్షాలు కురియడంతో, నీటి లభ్యత పెరగడంతో నిజాంసాగర్‌ పూర్తి స్థాయిలో నిండు కుండలా మారడంతో రెండు పంటలకు డోకా లేదని రైతులు కౌలు భూముల కోసం పోటీ పడ్డారు. కౌలు రైతుల మధ్య పోటీ భూయాజమానులకు లాభం చేకూర్చింది.

కౌలు భూములు తీసుకున్న రైతులు ఎండాకాలంలో రెండవ పంట ఏ పంట వేసేది అని సందిక్తం ఎదుర్కొంటున్నారు.విత్తనాల విక్రయాల జాతర కొనసాగేది. కానీ నేడు అందుకు భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. వేసవికాలం రెండవ పంట వరి పంట వేయవద్దని ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని ప్రభుత్వం చెప్పకనే చెప్పడంతో రైతుల్లో గందరగోళం ఏర్పడింది. వరి వేయకపోతే ఏ పంట వేయాలన్నది.. విత్తనాలు ఎక్కడ ఉన్నాయన్నది..రైతులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు కౌలు రైతులు కౌలును ఎలా చెల్లించేదని అంతర్మదనంలో పడ్డారు. తెలంగాణ ప్రభుత్వం రెండవ పంట వరి వేయవద్దని ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని వరి కొనేది లేదని పేర్కొన్న నేపద్యంలో పల్లెల్లో కౌలు వివాధాలు మొదలయ్యాయి. అధికశాతం గ్రామీణ ప్రాంతాలలో కౌలు రైతులే వ్యవసాయం పై ఆధారపడ్డారు. ప్రస్తుత పరిస్థితులు కౌలు రైతులకు నష్టం చేకూర్చేలా ఉన్నాయని కౌలు రైతులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement