హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రిలో ఇవాళ్టి నుంచి సాధారణ వైద్యసేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ ఏడాది మార్చి నుంచి గాంధీలో సాధారణ సేవలు నిలిపివేసి, కేవలం కరోనా సేవలకే పరిమితం చేశారు. కరోనా కేసులు అదుపులోకి రావడంతో నాన్ కొవిడ్ సేవలను అందిస్తున్నట్లు సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు పేర్కొన్నారు. ఆస్పత్రి ప్రధాన భవనాన్ని కొవిడ్ బ్లాక్‌గా మార్చారు. ఈ భవనంలోని 2, 3వ అంతస్తులను కరోనా చికిత్సకు, 4వ అంతస్తులోని ఈఎన్టీ విభాగాన్ని బ్లాక్ ఫంగస్ బాధితులకు కేటాయించినట్టు పేర్కొన్నారు. రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో ఆసుపత్రిలో నాన్ కొవిడ్ సేవలను తిరిగి ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని రాజారావు తెలిపారు.
తెలంగాణలో సెకండ్ వేవ్ లో కరోనా విజృంభించిన నేపథ్యంలో గాంధీ ఆసుపత్రిలో కోవిడ్ సేవలు తప్ప ఔట్ పేషెంట్, ఇన్ పేషెంట్ సేవలు, సర్జరీలను నిలిపివేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో సాధారణ వైద్య సేవలు అందక రోగులు ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం కరోనా ఉధృతి లేకపోవడంతో రోగులకు ఇబ్బంది లేకుండా అన్నిరకాల సేవలు ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో నేటి నుంచి అన్ని రకాల వైద్య సేవలను ప్రారంభించారు.