తెలంగాణలో ఎన్నికల నగరా మోగింది.. నేటి నుంచి ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది.. ఇక నామినేషన్ ల పర్వం నవంబర్ మూడో తేదినుంచి ప్రారంభం కానుంది.. ఎన్నికల నోటిఫికేషన్ నవంబర్ మూడో తేదిన జారీ చేస్తారు.. అదే రోజు నుంచి నామినేన్లు స్వీకరించారు.. నామినేషన్లు దాఖలు చేసేందుకు చివరితేది నవంబర్ 10 .
నవంబర్ మూడున అన్ని జిల్లా కేంద్రాల్లో ఎక్కడికక్కడ నోటిఫికేషన్ గెజిట్‌ను జారీ చేస్తారు. కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం నోటిఫికేషన్ జారీ అయిన మరుక్షణం నుంచే అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. అభ్యర్ధులు నవంబరు 10 వరకు నామినేషన్ దాఖలు చేయవచ్చు. నవంబరు 13న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు నవంబర్ 15 వరకు గడువు ఉంది. నవంబర్ 30 న పోలింగ్, డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది. డిసెంబర్ 5వ తేదీతో ఎన్నికల ప్రక్రియ ముగియనుంది.
ఎమ్మెల్యే అభ్యర్థులు నామినేషన్ పత్రాల సమర్పణ, నిబంధనల వివరాలు…..
ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేసే అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలతో పాటు రూ.10 వేలు నామినేషన్ రుసుంను చెల్లించాలి.
నామినేషన్ డిపాజిట్ రూ.10వేలు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ. 5వేలు, తప్పనిసరిగా కుల ధ్రువీకరణ పత్రం సమర్పించాలి.
కేంద్ర ఎన్నికల సంఘం నిర్ధేశించిన ఫారం-26 నోటరైజ్డ్ అఫిడవిట్‌ను అన్ని కాలమ్స్‌ను నింపాల్సి ఉంటుంది.
నామినేషన్ వేసే అభ్యర్థి నామినేషన్ వేయ డానికి 48 గంటల ముందే జాతీయ బ్యాంక్‌తో తన పేరు మీద ప్రత్యేకమైన ఖాతాను తెరవాల్సి ఉంటుంది.
ఎన్నికల వ్యయం ఈ ఖాతా నుంచి నిర్వహించాలి. ఈ ఎన్నికలకు నామినేషన్ ప్రక్రియ మొత్తం సీసీ కెమెరాల్లో చిత్రీకరిస్తారు.
అభ్యర్థులు తమ నామినేషన్ దాఖలు చేయడానికి ‘ఫారం-2బి’ సంబంధిత రిటర్నింగ్ అధికారి నుంచి ఉచితంగా పొందవచ్చు. ఒక్కో అభ్యర్థి 4 నామినేషన్ పత్రాలు దాఖలు చేసే వెసులుబాటు కూడా ఉంది.
గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ అభ్యర్థికి.. పోటీ చేసే నియోజకవర్గ పరిధిలోని ఒక్క ఓటరు ప్రతిపాదిస్తే సరిపోతుంది. రిజిస్టర్ పార్టీ లేక ఇండిపెండెంట్‌గా పోటీ చేసే అభ్యర్థిని మాత్రం నియోజకవర్గ పరిధిలోని 10 మంది ఓటర్లు ప్రతిపాదించాల్సి ఉంటుంది.
ప్రతిపాదించే ఓటరు నిరక్షరాస్యులైతే నామినేషన్ పత్రంలో వేలి ముద్రవేస్తే రిటర్నింగ్ ముందు వేలి ముద్ర వేయాల్సి ఉంటుంది.
గుర్తింపు లేని పార్టీలు, ఇండిపెండెంట్‌గా నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థులు నామి నేషన్ పత్రంలోని ‘ఫారం-2బి’ పార్ట్ 3లోని ‘సి’ కాలమ్ ఎదురుగానున్న గుర్తులను మూడింటిని ప్రాధాన్యతా క్రమంలో రాయాల్సి ఉంటుంది.
పోటీ చేసే అభ్యర్థి నియోజకవర్గ పరిధిలోని అభ్యర్థి కానట్లయితే అతడు నమోదైన నియోజకవర్గంలోని ఎలక్ట్రోల్ రిజిస్ట్రేషన్ అధికారి నుంచి ఓటరు జాబితా సర్టిఫైడ్ ప్రతిని తీసుకు వచ్చి నామినేషన్‌తోపాటు సమర్పించాల్సి ఉంటుంది.
గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నుంచి పోటీ చేసే అభ్యర్థులు ఫారం-ఎ, ఫారం-బి పత్రాలను నవంబరు 10న మధ్యాహ్నం 3 గంటల్లోపు రిటర్నింగ్ అధికారికి సమర్పించాలి.
అభ్యర్థులు తమ ఆస్తుల వివరాలనున, క్రిమినల్ కేసుల వివరాలను తప్పని సరిగా నామినేషన్ పత్రాల్లో పేర్కొనాలి.
విద్యుత్, మునిసిపాలిటీ, గ్రామ పంచాయతీ, ప్రభుత్వం కేటాయించిన వసతి గృహాలకు గత పది సంవత్సరాల నుంచి ఎటువంటి బకాయిలు లేనట్లు ధ్రువపత్రం జత చేయాలి.