హైదరాబాద్, ఆంధ్రప్రభ: ఏ పూట కా పూట బండిలో పెట్రోల్ పోయించుకుందామంటే కుదరకపోవచ్చు. ఎందుక ంటే ఇటీవల కొద్ది రోజులుగా పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఇటీవలికాలంలో ఎన్నడూ లేనంతగా పెట్రోల్ ఎప్పుడు దొరుకుతుందో… ఎప్పుడు దొరకదో తెలియని పరిస్థితులు నెలొంటున్నాయి. హైదరాబాద్‌తోపాటు గ్రామీణ తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లోనూ ఇప్పుడు పెట్రో, డీజిల్‌కు కొరత ఏర్పడుతోంది. దీంతో పెట్రోల్ కోసం వాహనదారులు నాలుగైదు పెట్రోల్ బంకులు తిరగాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. మూడు నెలల క్రితం హిందుస్థాన్ పెట్రోలియం (హెచ్‌పీసీఎల్), భారత్ పెట్రోలియం (బీపీసీపీఎల్) సంస్థలు తమకు అరువు (క్రెడిట్) సదుపాయాన్ని ఎత్తివేయడంతో ఈ సమస్య నెలకొందని డీలర్లు చెబుతున్నారు. పలు పెట్రో ఉత్పత్తి సంస్థలు నష్టాల పేరుతో ఉత్పత్తిని తగ్గిస్తుండడంతో పెట్రోల్, డీజిల్‌కు కటకట ఏర్పడుతోంది. హైదరాబాద్ నగరంతోపాటు రంగారెడ్డి, వికారాబాద్, ఖమ్మం తదితర జిల్లాల్లో పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు విరివిగా దర్శనమిస్తున్నాయి. డిమాండ్‌కు సరిపడినంతగా పెట్రోల్ సప్లయి లేకపోవడంతో నో స్టాక్ బోర్డులు పెడుతున్నామని బంకు యజమానులు చెబుతున్నారు. ప్రతి మూడు రోజులకోసారి పెడుతున్న ఇండెంట్ కోటాలో కేవలం 50 నుంచి 75శాతం మాత్రమే ఆయిల్ కంపెనీలు సరఫరా చేస్తున్నాయని , ఈ పరిస్థితుల్లో వినియోగదారులకు న్యాయం చేయలేకపోతున్నామని చేతులెత్తేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లోని ఎక్కువ బంకుల్లో పెట్రోల్, డీజిల్ నోస్టాక్ బోర్డులు పెడుతుండడంతో మిగతా బ్యాంకుల్లో రద్దీ పెరుగుతోంది. ఇంధనం కోసం వాహనదారులు బారులు తీరుతున్నారు. బంకుల వద్ద వాహనంతో చాలాసేపు వేచి ఉండాల్సి వస్తోందని వాహనదారులు వాపోతున్నారు.
రైతులకూ తప్పని ఇబ్బందులు..
ఇటీవల కురిసిన వర్షాలకు సాగును మొదలుపెట్టిన రైతులకు పెట్రోల్ బంకుల్లో డీజిల్ దొరక్కపోవడంతో దుక్కి దున్నే పనులు నిలిచిపోతున్నాయి. దుక్కి దున్నేందుకు ట్రాక్టర్లలో పోసేందుకు డీజిల్ కూడా అందుబాటులో లేకుండపోతుండడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో కర్ణాటక సరిహద్దు జిల్లాలైన రంగారెడ్డి, వికారాబాద్‌కు చెందిన ట్రాక్టర్, జేసీబీ, హార్వెస్టర్, లారీల యజమానులు కర్ణాటక లోని ప్రాంతాల బంకులకు వెళ్లి పెట్రోల్, డీజిల్‌ను తెచ్చుకుంటున్నారు. డీజిల్ కొరత సాకుతో ట్రాక్టర్ యజమానులు దున్నకం ట్రాక్టర్ కిరాయిని పెంచుతున్నారని రైతులు వాపోతున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.