Tuesday, November 26, 2024

వేత‌న‌మో ….. రామ‌చంద్రా

ధూప,దీప నైవేద్యాలకు నిధుల కొరత
మూడు నెలలుగా వేతనాలు అందక అర్చకుల వెతలు
అప్పు చేసి పూజా సామాగ్రి కొనుగోలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ఎలాంటి ఆదాయం లేక ఆదరణకు నోచుకోని దేవాలయాలలో పూజాది నిత్య కైంకర్యాల కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ధూపదీప నైవేద్యం పథకానికి నిధుల కొరత ఏర్పడింది. ఆలయ ఖజానాలో పైసా లేకపోవడం, భక్తుల నుంచి ఆశించిన మేర కానుకలు రాకపోవడంతో పాటు ప్రభుత్వం నుంచి రావాల్సిన నెలవారీ ప్రోత్సాహకాలు సైతం అందకపోవ డంతో అర్చకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆలయాల్లో పని చేస్తున్న పూజారుల జీవన భృతి కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి సీఎం వైఎస్‌ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ధూపదీప నైవేద్యం పథకాన్ని తీసుకొచ్చింది. ఇందులో భాగంగా పూజారులకు మొదట్లో రూ.2500 ప్రోత్సాహకంగా ఇచ్చే వారు. ఆ తరువాత తెలంగాణ రాష్ట్ర్రం ఏర్పాటు తరువాత అధికారంలోకి వచ్చిన కేసీఆర్‌ ప్రభుత్వం ఈ మొత్తాన్ని రూ.6 వేలకు పెంచింది. ఇందులో రూ.2 వేలు ధూపదీప నైవేద్యాలకు, మిగతా రూ.4 వేలు అర్చకులకు నెలవారీ గౌరవ వేతనంగా నిర్ణయించారు.

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 3,679 దేవాలయాలలో ధూపదీప నైవేద్యం పథకం అమలవుతుండగా, 3679 మంది పూజారులు దీని వల్ల లబ్ది పొందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ధూపదీప నైవేద్యాలకు నిధులు విడుదల చేసే బాధ్యతను ఫైనాన్స్‌ విభాగానికి అప్పగించింది. కాగా, గత మూడు నెలలుగా ధూపదీప నైవేద్యం పథకం కింద పూజారులకు నెలవారీ గౌరవ వేతనం అందకపోవడంతో దేవాలయాల రోజువారీ నిర్వహణకు అవసరమైన నూనె, పూలు, పండ్లు, కొబ్బరికాయలు, హారతి కర్పూరం వంటి ఇతర పూజా సామాగ్రి కోసం అప్పులు చేయక తప్పడం లేదు. ధూపదీప నైవేద్యం పథకం కింద ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాకపోవడంతో గ్రామీణ ప్రాంత పూజారులపై తీవ్ర ప్రభావం పడుతున్నది. పట్టణ ప్రాంతాల్లోని ఆలయాలకు భక్తులు రెగ్యులర్‌గా వస్తుంటారు. ఈ ఆలయాలకు హుండీ ద్వారా ఆదాయం కూడా భారీగానే ఉంటుంది. కానీ, మారుమూల ప్రాంతాల్లోని ఆలయాలకు భక్తులు పెద్దగా రారు. ప్రత్యేక పూజలు, ఇతర ఆదాయం కూడా అంతగా ఉండదు. అయినప్పటికీ సంప్రదాయబద్దంగా పూజాదికాలు జరగాలన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఎప్పుడో అప్పుడు నిధులు మంజూరు చేస్తుందన్న ఆశతో పూజారులు ఆలయ నిర్వహణ కోసం పూలు, పండ్లు, పూజా సామాగ్రి కొనుగోలు కోసం అప్పులు చేయక తప్పడం లేదు. ఇదిలా ఉండగా, దేవాదాయ శాఖ పరిధిలోకి రాని అధిక శాతం దేవాలయాలు పాలక మండళ్ల ఆధ్వర్యంలోనే నడుస్తున్నాయి. దేవాలయాలకు భక్తుల ద్వారా వచ్చే కొద్దిపాటి ఆదాయాన్ని సైతం పాలక మండళ్లు పక్కదారి పట్టిస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement