Thursday, November 21, 2024

సాగర్‌, శ్రీశైలం జ‌లాల‌పై నో రెస్పాన్స్ .. తెలంగాణ, ఏపీ విజ్ఞప్తి చేసినా స్పందన కరువు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : కేంద్రంతో కృష్ణా నదీ జలాల విడుదల పంచాయతీ ఎటూ తేలలేదు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో నాగార్జునసాగర్‌, శ్రీశైలం జలాశయాలకు నీటి విడుదల అంశంపై మంగళవారం తెలుగు రాష్ట్రాల అధికారులు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ)తో సమావేశమయ్యారు. ఇప్పటికే ఈ అంశంపై మూడుసార్లు సమావేశం వాయిదా పడిన నేపథ్యంలో తాజాగా వర్చువల్‌ పద్దతిలో నిర్వహించారు. ఇరు రాష్ట్రాల వాదనలు విన్న నదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ ఎలాంటి హామీ ఇవ్వలేదు. సాగర్‌ ఆయకట్టుకు నీరివ్వాలని తెలంగాణ ప్రభుత్వం తరఫున ఈఎన్‌సీ నారాయణ రెడ్డి తాగునీటి అవసరాల కోసం 5 టీఎంసీల నీటిని విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తరఫున ఈఎన్‌సీ మురళీధర్‌రావు బోర్డుకు ప్రతిపాదనలు చేశారు.

వర్షాలు, ప్రవాహాలు లేని పరిస్థితుల్లో నీటి విడుదల అంశం సాధ్యమైనంత త్వరలో నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత నీటి సంవత్సరం ప్రారంభమై 45 రోజులు పూర్తైనప్పటికీ నదుల్లోకి పెద్దగా ప్రవాహాలు లేవనీ గోదావరిలో కొంత మేర ఉన్నప్పటికీ కృష్ణాలో మాత్రం పరిస్థితి ఏ మాత్రం ఆశాజనకంగా లేదని తెలంగాన ప్రభుత్వం బోర్డుకు వివరించింది. ఇప్పటి వరకు ఎగువ నుంచి ప్రవాహాలు లేవు.. ఉపనది తుంగభద్ర నుంచి కూడా ఆశించిన మేర నీరు కృష్ణాలోకి చేరడం లేదు.. శ్రీశైలం, నాగార్జునసాగర్‌ జలాశయాల్లోకి ఇప్పటి వరకు నీరు చేరలేదు.. అని ఆంధ్రప్రదేశ్‌ సర్కారు తెలిపింది.

శ్రీశైలం జలాశయం పూర్తి సామర్థం 215 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం కేవలం 33 టీఎంసీలు మాత్రమే ఉంది. పూర్తి నిల్వ సామర్థం 885 అడుగులు కాగా ప్రస్తుతం నీరు ఉన్న స్థాయి 809 అడుగులు మాత్రమే. నాగార్జునసాగర్‌ జలాశయం పూర్తి సామర్థం 312 టీఎంసీలు కాగా ప్రస్తుత నిల్వ కేవలం 145 టీ-ఎంసీలు మాత్రమే ఉన్నట్లు అధికారులు నివేదించారు. జలాశయం పూర్తి నిల్వ సామర్థం 590 అడుగులు కాగా ప్రస్తుతం 518 అడుగుల వద్దే నీటి మట్టం ఉంది. నిరుడు రెండు రాష్ట్రాలు పోటీ పడి దిగువకు వదలడంతో రెండు జలాశయాల్లో కనీస నీటిమట్టం మిగిలిపోయింది.

- Advertisement -

రెండు జలాశయాల్లోకి ఈ ఏడాది ఇప్పటికి నీరు చేరలేదు. ఎగువ నుంచి ప్రవాహాలు ఇప్పట్లో వచ్చే అవకాశం కనిపించడం లేదు. దీంతో కృష్ణాపై ఆధారపడ్డ సాగు, తాగు నీటి అవసరాలకు ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. తాజా పరిణామాల నేపథ్యంలో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ మంగళవారం జరిగిన సమావేశంలో రెండు రాష్ట్రాలు వివరించాయి. కేఆర్‌ఎంబీ సభ్యకార్యదర్శి రాయిపురే నేతృత్వంలో వర్చువల్‌ విధానంలో జరగనున్న సమావేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ఈఎన్‌సీలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement