Friday, November 22, 2024

నిరుద్యోగులు ఆత్మహత్యపై స్పందించ‌ని కేసీఆర్.. బండి సంజయ్‌ ఆగ్రహం..

హదరాబాద్‌, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో 140 మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నా సీఎం కేసీఆర్‌ కనీసం స్పందించడం లేదని, ఏండ్ల తరబడి కోచింగ్‌ తీసుకుంటూ నిరుద్యోగులు అష్టకష్టాలుపడుతున్నా నోరు మెదపడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుబండి సంజయ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. యువకులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే మభ్య పెట్టడానికి కమిటీలంటూ కాలయాపన చేస్తున్నారని దుయ్యబట్టారు. అందుకే ఈ ప్రభుత్వంపై బీజేపీ యుద్ధం చేయబోతోందని, ఈనెల 16న లక్షలాది మంది యువతతో మిలియన్ మార్చ్ నిర్వహించబోతున్నామని ప్రకటించారు.

హైదరాబాద్‌లోని చిక్కడపల్లి సిటీ సెంట్రల్‌ లైబ్రరీని శుక్రవారం సందర్శించిన బండి సంజయ్‌ అక్కడ‌ చదువుకుంటున్న నిరుద్యోగులను కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన సంజయ్‌. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రధాన పాత్ర పోశించింది యువతనే అని అన్నారు, ప్రత్యేక రాష్ట్రం వస్తే బతుకులు బాగుపడుతాయన్న ఆశతో 1400 మంది యువత అసువులు బాస్తే వారి ఆశలు నెరవేర్చడంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఉద్యమ సమయంలో కేసీఆర్‌ మాట్లాడిన మాటలకు.. అధికారంలోకి వచ్చాక మాట్లాడుతున్న తీరుకు ఏ మాత్రం పొంతన లేదన్నారు. కేసీఆర్‌ వ్యవహారశైలికి వ్యతిరేకంగా అనేక‌ ఆందోళనలు చేశామని, యువత గోస వినడానికి, కళ్లారా చూడడానికే సెంట్రల్‌ లైబ్రీరికి వచ్చానన్నారు.

ఎన్నికలొస్తే నోటిఫికేషన్లంటూ లీకులివ్వడంతప్ప యువతకు ఉద్యోగాలు ఇచ్చింది లేదన్నారు. రోజుకో మాట.. పూటకో హామీ ఇస్తూ సీఎం మాట తప్పుతున్నారని మండిపడ్డారు. నాడు రాష్ట్రం కోసం యువత ఆత్మహత్య చేసుకుంటే నేడు ఉద్యోగాల కోసం ఆత్మహత్య చేసుకునే దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement