Saturday, November 23, 2024

TG | పత్తి విత్తనాల విషయంలో ఆందోళన వద్దు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : పత్తి విత్తనాల కోసం రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అన్ని కంపెనీల పత్తి విత్తనాలు రైతులకు అందుబాటులో ఉంచామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు చెప్పారు. అన్ని జిల్లాల కలెక్టర్లు విత్తన విక్రయాలపై దృష్టి సారించి రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం వివిధ జిల్లాల్లో విత్తన సరఫరాపై సచివాలయంలో సమీక్ష నిర్వహించారు.

రంగారెడ్డి, అదిలాబాద్‌ జిల్లా కలెక్టర్లతో స్వయంగా మాట్లాడి ఆ జిల్లాల్లో విత్తన పంపిణీపై ఆరాతీశారు. గత సంవత్సరం ఈ తేదీ నాటికి 1000 క్వింటాళ్ళ జిలుగు విత్తనాలు పంపిణీకాగా ఈ సంవత్సరం 1800 క్వింటాళ్ళ విత్తనాలు వచ్చాయని, వాటిని రైతులకు ఎటు వంటి ఇబ్బందులు లేకుండా సరఫరా చేస్తున్నామని రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ తెలిపారు.

అదేవిధంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్నీ జిల్లాలు కలెక్టర్లు స్వయంగా పర్యటిస్తూ విత్తన సరఫరాని సమీక్షిస్తున్నారని ఉన్నతాధికారులు మంత్రికి వివరించారు. రాబోయే రోజుల్లోనూ విస్తృతంగా పర్యటించి, రైతులకు ఎక్కడ ఇబ్బందులు తలెత్తకుండచూడాలని కలెక్టర్లను మంత్రి ఆదేశించారు.

కాగా.. జిల్లాలో పత్తి విత్తన ప్యాకెట్లు కూడా సమృద్దిగా ఉన్నాయని, రైతుల కోరిక మేరకు ఒక కంపెనీకు చెందిన విత్తన ప్యాకెట్లు కూడా గత సంవత్సరం కంటే 30,000 ప్యాకెట్లు అదనంగా ఇవ్వడానికి కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని, అదిలాబాద్‌ కలెక్టర్‌ వివరించారు. మరోవైపు గతేడాది రాష్ట్రంలో ఈ సమయానికి పచ్చిరొట్ట విక్రయాలు 26,997 క్వింటాలు ఉండగా, ఈ సంవత్సరం 58,565 క్వింటాలు పంపిణీ చేసామని మంత్రి వివరించారు.

గత సంవత్సరం కంటే దాదాపు 30 వేల క్వింటాలు అధికంగా పంపిణీ చేవామన్నారు. పత్తి ప్యాకెట్లు గత సంవత్సరం మే చివరి తేదీ నాటికి 45 లక్షలు అందుబాటులో ఉంచగా ఈ సంవత్సరం ఇప్పటికీ 75 లక్షలు ప్యాకెట్లు అందుబాటులో ఉంచామని తెలిపారు. మిగతావి కూడా జూన్‌ 5 లోపు సరఫరా చేయాల్సిందిగా ప్రత్తి కంపెనీలకు ఆదేశాలు ఇచ్చామని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement