Saturday, November 23, 2024

తెలంగాణ రాష్ట్రంలో లాక్‌ డౌన్‌ విధించబోం….

హైదరాబాద్‌, : తెలంగాణ రాష్ట్రంలో లాక్‌ డౌన్‌ విధించబోమని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌ రావు స్పష్టం చేశారు. లాక్‌ డౌన్‌ విధించడం వలన ప్రజాజీవనం స్థంభించడంతో పాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయే ప్రమాదమున్నదని తెలిపారు. గత అనుభవాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో లౌక్‌ డౌన్‌ విధించినా కూడా పాజిటివ్‌ కేసులు తగ్గడం లేదనే విషయాన్ని పరిశీలిం చిన సీఎం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రానికి కావాల్సిన వాక్సిన్లు ఆక్సీజన్‌ రెమిడిసివర్‌ సరఫరా గురించి ప్రధాని నరేంద్రమోడితో టెలిఫోన్లో మాట్లాడి తక్షణమే రాష్ట్రానికి సమకూర్చాల్సిందిగా అభ్యర్థించారు. తమిళ నాడులోని శ్రీ పెరంబదూరు నుంచి కర్నాటకలోని బల్లారి నుంచి రాష్ట్రానికి కేటాయించిన ఆక్సీజన్‌ అందడంలేదని ప్రధాని దృష్టికి తెచ్చారు. మెడికల్ హబ్‌ గా హైదరాబాద్‌ మారినందున సరిహద్దు రాష్ట్రాల ప్రజలు కూడా హైద్రా బాద్‌ మీదనే వైద్యసేవలకు ఆధారపడుతున్నారని తెలిపారు. మహారాష్ట్ర, చత్తీస్‌ గడ్‌, కర్నాటక, ఆంధ్ర ప్రదేశ్‌ తదితర రాష్ట్రాలనుంచి హైద్రాబాద్‌ కు కోవిడ్‌ చికిత్సకోసం చేరుకోవడం వలన హైద్రాబాద్‌ మీద భారం పెరిగి పోయిందని సిఎం వివరించారు. తెలంగాణ జనాభాకు అధనంగా 50 శాతం కరోనా పేషెంట్లు ఇతర రాష్ట్రాలనుంచి రావడం వలన హైద్రాబాద్‌ మీద ఆక్సీజన్‌, వ్యాక్సీన్‌ , రెమిడిసివర్‌ మంటి మందుల లభ్యతమీద పడుతున్నదని ప్రధానికి సిఎం తెలిపారు. ఈ పరిస్థితుల్లో ప్రస్థుతం రోజుకు 440 మెట్రిక్‌ టన్నుల ఆక్సీజన్‌ మాత్రమే రాష్ట్రానికి అందుతోందని దాన్ని 500 మెట్రిక్‌ టన్నుల కుపెంచాల్సిందిగా ప్రధానిని కోరారు. రోజుకు తెలంగాణలో కేవలం 4900 రెమిడిసివర్లు మాత్రమే అందుతున్నాయని వాటిని రోజుకు కనీసం 25000 కు పెంచాలని కోరారు. ఇప్పటి వరకు కేంద్రం 50 లక్షల డోసులను అందచేసిందని కానీ రాష్ట్ర అవసరాల దృష్ట్యా అవసరం మరింతగా వున్నదని కోరారు. రాష్ట్రానికి వాక్సీన్లు ప్రతిరోజుకు 2 నుంచి2.5 లక్షల డోసులు అవసరం పడుతున్నదని వాటిని సత్వరమే సరఫరాచేయాలని ప్రధాని మోడీని సిఎం కెసిఆర్‌ విజ్జప్తి చేశారు. సీఎం కెసిఆర్‌ ప్రధాని మోడీకి చేసిన వినతికి తక్షణ స్పందన లభించింది. ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు కేంద్ర మంత్రి పీయూష్‌ గోయెల్‌ సిఎం కేసీఆర్‌ తో మాట్లాడారు. ప్రధానికి కెసిఆర్‌ విన్నవిం చిన అంశాలన్నింటిని సత్వరమే రాష్ట్రానికి సమాకూరుస్తామని, ఆక్సీజన్‌ వాక్సీన్‌ రెమిడిసివర్‌ సత్వర సరఫరాకు చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి పియూష్‌ గోయెల్‌ సిఎంకు హామీ ఇచ్చారు. ఆక్సీజన్‌ ను కర్నాటక తమిళనా డులనుంచి కాకుండా తూర్పు రాష్ట్రాలనుంచి సరఫరా జరిగేలా చూస్తామన్నారు.
కరోనా పరిస్థితులపై సుదీర్ఘ సమీక్ష
కరోనా పరిస్థితుల పై గురువారం ప్రగతిభవన్‌ లో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని సీఎం నిర్వహింహంచారు. ఈ సమీక్షలో ప్రణాళికా సంఘం ఉపాద్యక్షులు బోయిన పల్లి వినోద్‌ కుమార్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకష్ణారావు, సిఎం కార్యదర్శి భూపాల్‌ రెడ్డి, సిఎంవో కరోనా ప్రత్యేక పర్యవేక్షణాధికారి రాజశేఖర్‌ రెడ్డి, వైద్యారోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి రిజ్వీ, హల్త్‌ డైరక్టర్‌ శ్రీనివాసరావు, డిఎంఈ రమేశ్‌ రెడ్డి, కరుణాకర్‌ రెడ్డి, చంద్రశేఖర్‌ రెడ్డి గంగాధర్‌ తదితరలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఎం రాష్ట్రంలో నెలకొన్న కరోనా పరిస్థితులను కూలంకషంగా సిఎం సమీక్షించారు. ప్రస్తుతం ఎంతవరకు ఆక్సీజన్‌ అందుతున్నది ఇంకా ఎంతకావాలి? వాక్సిన్‌ లు ఎంత మేరకు అందుబాటులో వున్నవి రోజుకు ఎంత అవసరం ? రెమిడిసివర్‌ మందు ఏ మేరకు సప్లయి జరుగుతున్నది రాష్ట్రావసరాలకు రోజుకు ఎన్ని అవసరం అనే విషయాలను ఆక్సీజన్‌ బెడ్ల లభ్యత వంటి విషయాల మీద పూర్తిస్థాయిలో చర్చించారు. రెమిడిసివర్‌ తయారీ సంస్థలతో ఫోన్లో మాట్లాడిన సిఎం వాటి లభ్యతను మరింతగా పెంచాలని కోరారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 9500 ఆక్సీజన్‌ బెడ్లు వున్నాయని వాటిని హైద్రాబాద్‌ సహా జిల్లాల్లో కలిపి మరోవారం రోజుల్లో వీటి సంఖ్యను మరో 5000 కు పెంచాలన్నారు.
మెరుగైన ఆక్సీజన్‌ సరఫరాకోసం వొక్కోటి కోటి రూపాయల చొప్పున 12 క్రయోజనిక్‌ ట్యంకర్లను చైనా నుంచి వాయు మార్గంలో అత్యవసరంగా దిగుమతి చేయాలని సిఎస్‌ ను సిఎం ఆదేశించారు. ఇందుకు సంబంధించి చర్యలను అత్యంత వేగంగా పూర్తిచేయాలని సిఎస్‌ ను సిఎం ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు కమ్యునిటీ హాస్పటల్స్‌ ఏరియా ఆస్పటల్స్‌ ల్లో మొత్తం 5980 కోవిడ్‌ అవుట్‌ పేషెంట్‌ సెంటర్లు ఏర్పాటుచేశామని వీటి సేవలను ప్రజలు ఉపయోగించుకోవాలని కోరారు.
సెకండ్‌వేవ్‌లో 1.56లక్షల పాజిటివ్‌.. 85 శాతం రికవరీ
సెకండ్‌ వేవ్‌ లో ఇప్పటివరకు ప్రభుత్వ ప్రయివేట్‌ ఆసుపత్రుల్లో కలిపి లక్షాయాభైయారు వేల పాజిటివ్‌ కేసులు నమోదుకాగా అందులో లక్షా ముప్పయివేలు (85 శాతం) కోలుకున్నారని అధికారులు సిఎం కు వివరించారు. రోజువారిగా కరోనా పరిస్థితిపై ప్రతిరోజూ సాయంత్రం వైద్య అధికారులు రోజూ సాయంత్రం మీడియా సమావేశం నిర్వ#హంచి వివరాలను వెల్లడించాలని సిఎం తెలిపారు. దీనికి డైరక్టర్‌ ఆఫ్‌ హల్త్‌ బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు. అందుకు సంబంధించి పాజిటివ్‌ కేసుల వివరాలు కోలుకున్న వారి వివరాలు హూం క్వారెంటైన్‌ లో ఎంతమంది వున్నారు ప్రభుత్వ దవాఖానాల్లో ఎంతమంది చికిత్స పొందుతున్నారు ప్రయివేట్‌ దవాఖానాల్లో ఎంతమంది అనే వివరాలను పబ్లిక్‌ డోమైన్లో ప్రదర్శించాలని ఆదేశించారు. రాష్ట్రంలో కరోనా నియంత్రణ కోసం వైద్యశాఖ తీసుకుంటున్న చర్యలను పర్యవేక్షించేందుకు ప్రత్యేక అధికారిని నియమించాలన్నారు. వైద్య శాఖకు అవసరమైన నిధులను వెంట వెంటనే విడుదల చేయాలని ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావును సిఎం ఆదేశించారు. ఇందుకు సంబంధించి నిధుల విడుదలకు ప్రత్యేక అధికారిని నియమించాలన్నారు.
రెండో డోస్‌కు ప్రాధాన్యత ఇవ్వండి
మొదటి డోస్‌ వాక్సిన్‌ వేసుకున్నవాళ్ళకు వారి నిర్ణీత సమయాన్ని అనుసరించి రెండో డోస్‌ వేసేందుకు ప్రాధాన్యతనివ్వాలని సిఎం ఆదేశించారు. ఆక్సీజన్‌ సరఫరా గురించి సమీక్షించిన సిఎం రాష్ట్రంలో ఆక్సీజన్‌ లభ్యతను పెంచేందుకు పలు ప్రయత్నాలు చేశారు. ఈ సందర్భంగా ఐఐసిటి డైరక్టర్‌ చంద్రశేఖర్‌ తో ఫోన్లో మాట్లాడారు. తక్షణమే ఆక్సీజన్‌ నిల్వలను పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలను ఆరాతీసారు. వారి సూచనల మేరకు తక్షణమే 500 ఆక్సీజన్‌ ఎన్రిచర్లను కొనుగోలు చేయాల్సిందిగా వైద్యాధికారులను ఆదేశించారు. త్వరలో మరిన్ని సమకూర్చాలని, తక్కువ సమయంలో ఆక్సీజన్‌ ఉత్పత్తిని జరిపే వ్యవస్థలను నెలకొల్పేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా సిఎం సూచించారు. పంచాయతీరాజ్‌ మున్సిపల్‌ అధికారులు గ్రామాలు పట్టణాల్లో సోడియం హపోక్లోరైడ్‌ ను పిచికారీ చేయించి పరిసరాలను పరిశుభ్రతకు తక్షణ చర్యలు తీసుకోవాలని సిఎం ఆదేశించారు. ప్రజా ప్రతినిధులు ఇందులో భాగస్వాములు కావాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement