Sunday, November 3, 2024

ఫుట్ పాత్ లు ఖాళీలేవ్.. సిటీలో నడవనీకి జాగా లేదు

ప్రభన్యూస్‌డిబ్యూరో ఉమ్మరంగారెడ్డి: నడక అనేది సర్వరోగ నివారినిగా మారింది. వాకింగ్‌ చేయడం ద్వారా రోగాలు రాకుండా కట్టడి చేసే అవకాశం ఉండటం, ఇప్పటికే వచ్చిన రోగాలు కంట్రోల్‌ ఉంటాయనే నమ్మకంతో వయస్సుతో సంబంధం లేకుండా చాలామంది వాకింగ్‌కు ప్రాధాన్యమిస్తున్నారు. పల్లెలు పట్టణాలు అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాలకు మార్నింగ్‌ వాకింగ్‌కు వెళ్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పెద్దగా సమస్యలు కనిపించడం లేదు. ఎటొచ్చి శివార్లలో సమస్యలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి.

రోగాలు రాకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఉదయం వాకింగ్‌కు ప్రాధాన్యమిస్తున్నారు. వయస్సుతో సంబంధం లేకుండా చాలామంది మార్నింగ్‌ వాకింగ్‌కు వెళ్తున్నారు. ఇప్పటికే షుగర్‌, బీపీలు వచ్చిన వాళ్లు విధిగా వాకింగ్‌ చేస్తున్నారు. వాకింగ్‌ చేసేందుకు సరియైన సదుపాయాలు లేకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు.వాకింగ్‌ చేసేందుకు సరియైన ట్రాక్‌లు మచ్చుకైనా కనిపించడం లేదు. శివార్లు రోజురోజుకు విస్తరిస్తున్నాయి. ఇక్కడ భూముల విలువ ఒక్కసారిగా పెరిగిపోయింది. పార్కుల కోసం ఏర్పాటు చేసిన స్థలాలు కూడా చాలా ప్రాంతాల్లో ఆక్రమణలకు గురయ్యాయి. మార్నింగ్‌ వాకింగ్‌కు ప్రాధాన్యమిస్తున్నా సరియైన వసతులు లేక ఇబ్బందిపడుతున్నారు.

ముఖ్యంగా మార్నింగ్‌ వాకింగ్‌కు వెళ్లేవాళ్లు ఫుట్‌పాత్‌లపై నుండి నడిచే పరిస్థితులు లేవు. రోడ్లపైనుండే వాకింగ్‌ చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఉదయం 5గంటలకే వాహనాల రాకపోకలు ప్రారంభమవుతున్నాయి. దీంతో రోడ్ల పైనుండి వెళ్లేందుకు జంకుతున్నారు. చాలా ప్రాంతాల్లో ఇసుక, ఇటుకలు, కంకర కుప్పలు దర్శనమిస్తుండటంతో పాదాచారులకు ఇబ్బందులు తప్పడం లేదు. రోడ్ల పక్కనే ఉండే దుకాణదారులు కూడా ఫుట్‌పాత్‌లపై మెటీరియర్లు ఏర్పాటు చేస్తున్నారు. హార్డ్‌ వేర్‌ షాపులకు సంబంధించి చాలా మెటీరియల్‌ ఫుట్‌పాత్‌లపై ఏర్పాటు చేస్తున్నారు. అప్పుడప్పుడు ట్రాఫిక్‌ పోలీసులు వచ్చి హడావుడి చేయడం తరువాత మరిచిపోవడం పరిపాటిగా మారింది.

మార్నింగ్‌ వాకింగ్‌ చేసేందుకు ఇబ్బందిగా ఉంది చర్యలు తీసుకోవాలని వాకర్లు మునిసిపల్‌ అధికారులకు విన్నవించినా ప్రయోజనం లేకుండాపోయింది. ఇప్పటికైనా మునిసిపల్‌ శాఖ అధికారులు స్పందించి ఫుట్‌పాత్‌లపై కొనసాగుతున్న అక్రమ వ్యాపారాలను నివారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement