భూపాలపల్లి, ప్రభన్యూస్ : 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ప్రాణాహిత పుష్కరాలు ఈసారి మాత్రం కళ తప్పాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఘనంగా జరిగిన మహాఘట్టం స్వరాష్ట్రంలో వెలవెలబోతోంది. అప్పుడు భారీగా ప్రచారం చేసిన అధికారులు వాటి ఊసే మరిచిపోయారు. 12 రోజుల పాటు భక్తజన సందోహంతో విరాజిల్లాల్సిన కాళేశ్వరం క్షేత్రం, త్రివేణి సంగమంలో భక్తుల పుణ్యస్నానాలు లేక అధికారుల తీరుతో నిర్మానుష్యంగా మారింది. పుష్కారాలు ప్రారంభమై మూడు రోజులు గడుస్తున్నప్పటికీ కాళేశ్వరానికి వచ్చే భక్తులను అధికారులే పొరుగున మహారాష్ట్రకు తరలిస్తుండటంతో భక్తులు లేక కాళేశ్వరం పురవీధులు వెలవెలబోతున్నాయి.
6 చోట్ల పార్కింగ్ స్థలాలు, వైద్యశిబిరాలు, తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్లు, బట్టలు మార్చుకునే గదులు, బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్ కూడా ఏర్పాటు చేశారు. శుక్రవారం మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోళీకేరీ ముక్తీశ్వరున్ని దర్శించుకున్నారు. దీంతో నిత్యం రద్దీ పెరుగుతుందని అంచనాకు వచ్చిన అధికారులు గురువారం నుండి రూటూ మార్చారు. పుష్కరాలపై ఏ మాత్రం ప్రచారం నిర్వహించ లేకవడం గమనార్హం. ఏం జరిగిందో ఏమో కాని కాళేశ్వరానికి వచ్చిన భక్తులను అధికారులు 10 మినీ బస్సుల ద్వారా ఉచితంగా మహారాష్ట్రలోని సిరొంచకు తరలిస్తున్నారు. అక్కడి వెళ్ళి పుష్కర స్నానం చేసి తిరిగి నేరుగా వారివారి స్వస్థలాలకు వెళుతున్నారు. వివిధ ప్రాంతాల నుండి ప్రాణహిత పుష్కరాలకు మహారాష్ట్ర సిరొంచకు నిత్యం 1లక్ష 50వేలకు పైగా భక్తులు వెళ్తున్నట్లు సమాచారం. దీంతో కాళేశ్వర ముక్తీశ్వర క్షేత్రంతో పాటు త్రివేణి సంగమంలో భక్తులు లేక వెలవెలబోతుంది. కాళేశ్వర పురవీధులు నిర్మానుష్యంగా మారాయి.
ఖాళీగా దర్శనమిస్తున్న పార్కింగ్ స్థలాలు..
వివిధ ప్రాంతాలు, రాష్ట్ర నలుమూలలనుండి భక్తులు వస్తారనే అంచనాలతో కాళేశ్వరంలో ఆరు చోట్లు పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశారు. కానీ వచ్చే వాహనాలను నేరుగా మహారాష్ట్రకు తరలించడంతో వాహనాలు లేక పార్కింగ్ స్థలాలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి.
ధర్నాకు సిద్ధమవుతున్న చిరువ్యాపారులు..
ప్రాణహిత పుష్కరాలకు అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తారని భావించిన చిరు వ్యాపారులు భక్తులు లేక గిరాకీలు కాక సతమతమవుతున్నారు. అధికారులు కాళేశ్వ రానికి వచ్చే భక్తులను నేరుగా మహారాష్ట్రకు తరలిస్తుండ టంతోనే ఇక్కడ ఈ పరిస్థితి ఏర్పడిందని గతంలో ఇలాంటి పరిస్థితి లేదంటున్నారు. దీంతో వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నామని, అధికారుల తీరుమారకుంటే చిరు వ్యాపారులంతా ధర్నా చేపడతామని చెబుతున్నారు.
త్రివేణి సంగమానికి బిల్వహారతి..
12 రోజుల పుష్కరాల్లో భాగంగా త్రివేని సంగమంలో రోజుకో హారతి ఇవ్వడం ఆనవాయితీ. మూడవ రోజు శుక్రవారం త్రివేణి సంగమంలో వేదపండితులు బిల్వ హారతి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..