Friday, November 22, 2024

ఫీ’జులుం’కి అడ్డుక‌ట్ట ఎప్పుడు….

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ప్రైవేట్‌ స్కూళ్ల అడ్డగోలు ఫీజులపై కొరడా ఝుళిపిస్తామని ప్రకటించిన విద్యాశాఖ.. కార్పొరేట్‌, ప్రైవేట్‌ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణపై ఇంత వరకూ ఉలుకు లేదు…పలుకు లేదు.ఫీజుల నియంత్రణకు పటిష్టమైన చట్టం తీసుకొస్తామన్న అంశం ఈ విద్యా సంవత్సరం కూడా అటకెక్కినట్లుగా తెలుస్తోంది. కేవలం ఒక్క ప్రైవేట్‌ స్కూళ్లలోనే కాదు.. ఇంటర్‌, డిగ్రీ, పాలిటెక్నిక్‌ కాలేజీల్లోనూ ఒక నిర్ధిష్ట ఫీజుల విధానం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫీజులపై నియంత్రణ ఉండాలనే డిమాండ్‌ తల్లిదండ్రుల నుంచి పెద్ద ఎత్తున ఉంది. అయితే ఫీజులను ప్రభు త్వం కట్టడి చేస్తోందని భావిస్తున్న తల్లిదండ్రులకు ప్రతి ఏడాది నిరాశే మిగులుతోంది. ప్రతి ఏటా కొన్ని కార్పొరేట్‌, ప్రైవేట్‌ స్కూళ్లు, ఇంటర్‌ కాలేజీలు, డిగ్రీ విద్యాసంస్థలు ఫీజులను సుమారు 20శాతం నుంచి 50శాతం వరకు పెంచుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. జూన్‌ నుంచి నూతన విద్యా సంవత్సరం 2023-24 ప్రారంభం కానుంది. ఒకవైపు ఫీజులను పెంచేసి అడ్మిషన్లను కూడా ముగించేస్తుంటే విద్యాశాఖ మాత్రం ఫీజుల నియంత్రణపై ఇంకా ఎటూ తేల్చడంలేదు. గతేడాది జనవరిలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో రాష్ట్రంలోని ప్రైవేట్‌ స్కూళ్లలో ఫీజుల నియంత్రణకు ప్రత్యేక చట్టం తీసుకువస్తామని ప్రభుత్వ పెద్దలు ప్రకటించారు. స్కూళ్లే కాదు.. ఇంటర్‌, డిగ్రీ పాలిటెక్నిక్‌ కోర్సుల్లోనూ నిర్దిష్ట ఫీజుల విధానాన్ని ఖరారు చేయనున్నట్లు ప్రకటించారు. ప్రకటన చేసి కూడా ఏడాది దాటిపోయింది. ఆ విద్యా సంవత్సరం పోయి మరో అకాడమిక్‌ ఇయర్‌ కూడా ప్రారంభం కాబోతోంది. ఇంత వరకూ ఫీజుల నియంత్రణ అంశం పూర్తిస్థాయిలో కొలిక్కిరాని పరిస్థితి ఉంది.

దీంతో తమ ఇష్టానుసారంగా కొన్ని కార్పొరేట్‌, ప్రైవేట్‌ స్కూళ్లు, కాలేజీలు ఫీజులను దండుకుంటున్నాయి. ఫీజుల నియంత్రణను, నిబంధనలకు విరుద్ధంగా చేపడుతున్న అడ్మిషన్ల ప్రక్రియను అడ్డుకోవాల్సిన విద్యాశాఖ అధికారులు చోద్యం చూస్తున్నారనే విమర్శులు వినిపిస్తున్నాయి. ఏకంగా గత నవంబర్‌ నుంచే కొన్ని విద్యా సంస్థలు అడ్మిషన్ల ప్రక్రియను ప్రారంభించేశాయి. అంతేకాకుండా వచ్చే విద్యాసంవ్సరానికి 9, 10 తరగతి విద్యార్థులకు జేఈఈ, నీట్‌, ఐఐఐటీ పేర్లతో తరగతులు కూడా ప్రారంభించేశారు. ఇదంతా తెలిసినా అధికారులు మాత్రం తమకు ఏం పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఏదైనా సంఘటన జరిగినప్పుడు మాత్రం హడావుడీ చేసి చేతులు దులిపేసుకుంటున్నారు.
ఫీజుల నియంత్రణపై అధ్యయనం చేసేందుకు మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, కేటీఆర్‌, హరీష్‌రావు, గంగుల కమలాకర్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావు, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌తో ప్రభుత్వం అప్పట్లోనే సబ్‌కమిటీని నియమించింది. ఈ కమిటీ పలుమార్లు ఫీజుల నియంత్రణపై సమావేశాలు కూడా నిర్వహించి మార్గదర్శకాలను రూపొందించింది. 2022-23 విద్యా సంవత్సరంలోనే ఫీజుల నియంత్రణ చట్టం అమలులోకి తీసుకొచ్చేలా పలుమార్లు సమావేశాలు కూడా నిర్వహించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. కానీ ఇప్పటి వరకూ ఫీజుల నియంత్రణపై నిర్దిష్టమైన చట్టం, విధానాన్ని మాత్రం ప్రకటించకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. అయితే స్కూల్‌ ఫీజుల విషయంలో మాత్రం కొన్ని మార్గదర్శకాలను సబ్‌కమిటీ రూపొందించింది. మొన్న జరిగిన బడ్జెట్‌ సమావేశాల్లోనైనా దీనిపై ప్రత్యేక చట్టం తీసుకొస్తారని అంతా భావించారు. కానీ అది కూడా కార్యరూపం దాల్చలేదు. ఫలితంగా ప్రైవేట్‌, కార్పొరేట్‌ విద్యాసంస్థల్లో అడ్మిషన్ల కోసం వెళ్లిన తల్లిదండ్రులకు ఫీజులు చూస్తే దిమ్మతిరుగుతోంది. ప్రస్తుతం రానున్న విద్యా సంవత్సరానికి కొన్ని విద్యా సంస్థల్లో ఫీజులను 20శాతం నుంచి 50శాతం వరకు పెంచి తల్లిదండ్రులపై ఫీజుల భారాన్ని మాెెపీ ముక్కుపిండి వసూలు చేసేస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement