మణికొండ ఫిబ్రవరి 9(ప్రభ న్యూస్ ): రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతోనే మొదలైన మునిసిపాలిటీల్లో అవిశ్వాసాల రగడ కొత్త మునిసిపాలిటీ మణికొండనూ తాకింది. చైర్మన్ కస్తూరి నరేందర్ పై 10 మంది కౌన్సిలర్ల సంతకాలతో రెండో వార్డు కౌన్సిలర్ చవాన్ వసంత్ రావ్ ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానం ఈ నెల 22న ఓటింగ్ కు రానుంది. కాగా, మణికొండ మున్సిపాలిటీ చైర్మన్ గా కాంగ్రెస్ పార్టీకి చెందినవారే. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో రాజేంద్రనగర్ అభ్యర్థిగానూ పోటీ చేశారు. మరోవైపు మునిసిపాలిటీలో ఇప్పటికే పలు ప్రగతిదాయక కార్యక్రమాలు చేపట్టారు. దీంతోనే ఆయన ప్రజాభిమానం చూరగొని.. ఏకంగా రాజేంద్ర నగర్ వంటి అసెంబ్లీ టికెట్ పొందారు.
అయితే, కొంతకాలంగా చైర్మన్ ను ఓ వర్గం ఆర్థిక వ్యవహారాల రీత్యా వ్యతిరేకిస్తోంది. ఈ నేపథ్యంలోనే మునిసిపాలిటీకి నాలుగేళ్ల పదవీ కాలం పూర్తవండంతో వారికి అవిశ్వాసం అనే ఆయుధం చిక్కింది. దానిని అడ్డంపెట్టుకుని తమకు చైర్మన్ పై ఉన్న వ్యతిరేకతను సొమ్ము చేసుకోవాలని చూస్తున్నారు. అందుకే అవిశ్వాస తీర్మానానికి సిద్ధమయ్యారు. ఈ మేరకు అవిశ్వాసం కోరుతూ కలెక్టర్ కు లేఖ రాయగా.. ఈ నెల 22వ తేదీన అందుకు సమయం ఇచ్చారు. అయితే, మునిసిపాలిటీలో పరిస్థితులు మాత్రం భిన్నంగా ఉన్నాయి. అవిశ్వాసానికి సిద్ధమంటూ 10 మంది కౌన్సిలర్లు సంతకాలు చేసినా.. వీరిలో ఆ తర్వాత చాలామంది మనసు మార్చుకున్నట్లు సమాచారం. ఓటింగ్ సమయానికి సగం మంది పక్కకు తప్పుకొన్నా ఆశ్చర్యం లేదనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అంతేకాక.. తీర్మానం వీగడం ఖాయమనే కథనాలూ వస్తున్నాయి.
దీనిపై మున్సిపల్ చైర్మన్ కస్తూరి నరేందర్ ముదిరాజ్ ను ‘ఆంధ్రప్రభ ప్రతినిధి‘ వివరణ కోరగా.. అవిశ్వాసం వీగిపోతుందనే ధీమా వ్యక్తం చేశారు. కౌన్సిలర్లు అందరూ తనకు అత్యంత సన్నిహితులని, పరిస్థితుల ప్రభావంతోనే వారు అనూహ్యంగా అవిశ్వాసానికి వెళ్లినట్లు తెలిసిందన్నారు. గతంలోనూ అవిశ్వాసం అంశంపై ‘ఆంధప్రభ’ ప్రచురించిన కథనాలను నరేందర్ ముదిరాజ్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. అది పైసల విశ్వాసం అని పేర్కొన్న సంగతిని ప్రశంసించారు. ఇంకోవైపు.. ఈ నెల 22న అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ నాటికి పరిస్థితులు చాలా మారొచ్చు. మునిసిపాలిటీలో 20 వార్డులుండగా.. బీఆర్ఎస్ కు 5, కాంగ్రెస్ 8 మంది సభ్యుల బలం ఉంది. ఎన్నికల సమయంలో బీజేపీకి 6 వార్డులు వచ్చాయి. కస్తూరి నరేందర్ ముదిరాజ్ చొరవతో బద్ధ శత్రువులైనప్పటికీ బీజేపీ-కాంగ్రెస్ చేతులు కలిపాయి. మునిపల్ చైర్మన్ గా నరేందర్ ఎన్నికయ్యారు.