శుభకార్యాలకు వెళ్లినప్పుడు బొకేలకు బదులు మంచి పుస్తకాలు ఇవ్వాలని తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సూచించారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన బుక్ ఫెయిర్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పుస్తకాల్లో అనంతమైన జ్ఞానం ఉందన్నారు. పుస్తకాలను నమిలి మింగేసేంత క్షుణ్ణంగా చదవాలన్నారు. ఈ-బుక్స్ కంటే పుస్తకాల్లోనే మజా ఉంటుందని తెలిపారు.
పుస్తకాలు చదువుతుంటే రచయితతో నేరుగా మాట్లాడుతున్నట్లుగా ఉంటుందన్నారు. విశ్వం గురించి తెలియాలంటే పుస్తకాలు చదవాల్సిందేనన్నారు. నిరక్షరాస్యులకు ఆడియో బుక్స్ కూడా అందుబాటులోకి వచ్చాయని గుర్తు చేశారు. నేటి యువత పుస్తకాల వైపు మళ్లేలా పెద్దలు ప్రోత్సహించాలన్నారు. కాగా, హైదరాబాద్ బుక్ ఫెయిర్ రేపటితో ముగియనుంది.
- Advertisement -