Friday, November 22, 2024

NZB: రాష్ట్రాన్ని రోహింగ్యాల అడ్డాగా మారుస్తారా ? ఉత్త‌మ్ పై ధర్మపురి అరవింద్ ఫైర్

నిజామాబాద్ ప్రతినిధి, ఏప్రిల్ 3(ప్రభ న్యూస్) : తెలంగాణ రాష్ట్రాన్ని రోహింగ్యాల అడ్డాగా మారుస్తారా ?… కేవలం మైనారిటీ ఓట్ల కోసం మత విద్వేషాలను రెచ్చగొట్టడానికే కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలపై ఎంపీ ధర్మపురి అరవింద్ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్ఆర్సి సీఏఏ అమలు చేయమని రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దేశద్రోహిలా మాట్లాడుతున్నారని ఎంపీ ధర్మపురి అరవింద్ ధ్వజమెత్తారు. బుధవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ… దేశ సమగ్రత కోసం శాంతి సామరస్యాల కోసం పార్లమెం టులో అమలు చేసే చట్టాలను అందరూ గౌరవించాల్సిందేన‌న్నారు. సీఏఏని అమలు చేయాలని దేశానికి స్వతంత్రం వచ్చిన సమయంలో నెహ్రు ప్రభుత్వమే చెప్పిందని గుర్తు చేశారు. ముస్లిం ఓట్ల కోసమే కాంగ్రెస్ దిగజారుడు రాజకీయాలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. రాష్ట్రం బాగుండాలంటే నల్గొండ, మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాల్లో కాంగ్రెస్ ని ఓడించాలని అరవింద్ పిలుపునిచ్చారు.

దేశంలో దేశద్రోహులు రావడానికి ఎన్ ఆర్సి తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయమని ఉత్తమ్ కుమార్ రెడ్డి దేశద్రోహ చర్యకు పాల్పడ్డాడనీ మండిపడ్డారు. ఉత్తమ్ కుమార్ రెడ్డినీ వెంటనే రాష్ట్ర మంత్రి వర్గం నుంచి భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. గతంలో కేసీఆర్ బోధను దొంగ పాస్ పోర్టుల‌కు అడ్డాగా మార్చారని.. తాజాగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి జగిత్యాలను పీఎఫ్ఎకి అడ్డాగా మార్చారని ఆరోపించారు. గడ్డం పెంచినంత మాత్రాన సెక్యులరిజం కాదని ఉత్తమ్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అసలైన సెక్యులర్ పార్టీ బీజేపీ మాత్రమేనని అర్వింద్ పేర్కొ న్నారు. బాధ్యత గల రాష్ట్ర మంత్రి పదవిలో ఉండి ఉత్తమ్ మాట్లాడిన మాటలు ముమ్మాటికి దేశద్రోహమే అన్నారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న మంత్రి ఉత్తమ్ పై ఫిర్యాదు చేస్తామని ఎంపీ ధర్మపురి అరవింద్ తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు కులచారి దినేష్, అర్బన్ ఎమ్మెల్యే దన్ పాల్ సూర్యనారాయణ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement