Friday, November 22, 2024

TS: నిజామాబాద్ జిల్లాలో ఐదు స్థానాలు గెలుస్తాం… మంత్రి వేముల

నిజామాబాద్ జిల్లాలో ఐదు స్థానాలు గెలుస్తామని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలోని నవీపేట్ మండలంలో బుధవారం రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. గత కొన్ని రోజుల క్రితం తల్లి మృతిచెందారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి వారి అమ్మమ్మ స్వగ్రామం నవీపేట్ కావడంతో ఆనవాయితీగా నిద్ర కోసం రమణారెడ్డి ఇంటికి కుటుంబ సభ్యులతో కలిసి వచ్చారు. ఈసందర్భంగా మంత్రి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ… రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని, కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మేనిఫెస్టోలో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు. రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ ఐదు లక్షల కేసీఆర్ బీమా పథకం అమలు చేస్తామన్నారు. అర్హులైన వాళ్లందరికీ 400 రూపాయలకే గ్యాస్ సిలిండర్, ప్రతి పేద కుటుంబానికి అన్నపూర్ణ పథకం ద్వారా సన్న బియ్యం ఇవ్వడం జరుగుతుందన్నారు.

ఆసరాల పెన్షన్ 3000 రూపాయలు చేసి విడతల వారీగా 5016 రూపాయలు, పంటకు పెట్టుబడి పంటల బీమాను 16000 రూపాయలు, దివ్యాంగులకు పెన్షన్ రూ.6016లు, పేద కుటుంబానికి ఆరోగ్య శ్రీ కింద చికిత్స కోసం 15 లక్షల రూపాయలు చేస్తామని వివరించారు. మైనార్టీల సంక్షేమానికి బడ్జెట్ లో దశల వారీగా పెంచుతూ మైనార్టీ రెసిడెన్షియన్సయల్ పాఠశాలలను డిగ్రీ కళాశాల చేయడం జరుగుతుందని వివరించారు. కేసీఆర్ ప్రకటించిన మేనిఫెస్టోను చూసి ప్రతిపక్షాలు భయపడుతున్నాయన్నారు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో అన్ని నియోజకవర్గాలు బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. బోధన్ నియోజకవర్గం ఎమ్మెల్యే షకీల్ ఆమెర్ 50వేల పై మెజార్టీతో గెలవడం ఖాయమన్నారు.

దేశంలో వివిధ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అక్కడ చెయ్యని అభివృద్ధి ఇక్కడ చేస్తామని ప్రజలకు మధ్య పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో హనుమాన్ ఆలయం లేని ఊరు లేదు, కేసీఆర్ సంక్షేమ పథకం అందని ఇల్లు లేదని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కింద అడ్డంగా దొరికిపోయిన రేవంత్ రెడ్డి ఈరోజు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి రాజీనామా చేయక దొంగలాగా దాక్కున్నాడని వారు ఈరోజు పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం ఎంతవరకు సమంజసమని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆశీర్వాదంతో మూడోసారి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని జిమ్మిక్కులు చేసినా ప్రతిపక్షాలను ప్రజలు నమ్మడం లేదన్నారు. ఈ సమావేశంలో సర్పంచ్ ఏటీఎస్ శ్రీనివాస్, డాక్టర్ జగదీశ్వర్ రెడ్డి, రాంరెడ్డి, రమణారెడ్డి, తదితరులు ఉన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement