Friday, November 22, 2024

పోటెత్తిన గోదావరి, మంజీర.. ఒక్కరోజే 88 మి.మీ వర్షపాతం నమోదు

ఉమ్మడి నిజామాబాద్‌, ప్రభన్యూస్‌ బ్యూరో: తుపాన్‌ ప్రభావం ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాను అతలాకుతలం చేస్తోంది. ఎడతెరిపి లేకుండా రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో నదులు, వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. చెరువులు, కుంటలు నిండిపోయి మత్తళ్ళు దుంకుతున్నాయి. భారీ వర్షానికి జిల్లాలో ప్రధాన నదులైన గోదావరి, మంజీరా నదులకు వర్షపు నీరు పోటెత్తింది. ఉప్పొంగి ప్రవహించడంతో ప్రమాద హెచ్చరికలను జారీ చేశారు. నదీతీర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో నదుల వైపు వెళ్లొద్దని హెచ్చరించారు. గోదావరి నది పైభాగం నుంచి 2 లక్షలకు పైగా క్యూసెక్కుల వరదనీరు శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుంది. అంతేస్థాయిలో నీటిని దిగువ గోదావరిలోకి వదులుతున్నారు. దీంతో గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తుంది. ప్రాజెక్టు నీటిమట్టం 1091 అడుగులు కాగా నీటి సామర్థ్యం 90 టీఎంసీలుగా ఉంది. ప్రస్తుతం ఎస్సారెస్పీ పూర్తి స్థాయి నీటిమట్టాన్ని కొనసాగిస్తున్న అధికారులు వస్తున్న వరదనీటిని దిగువనకు 30 గేట్లు ఎత్తి వదులుతున్నారు. నిజాంసాగర్‌ ప్రాజెక్టులోకి మంజిర నది ఉరకలు వేస్తుంది. ఎగువ భాగం నుంచి 80 వేల క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతుంది. 82 వేల క్యూసెక్కుల నీటిని దిగువ మంజిరాలోకి వదులుతున్నారు. 1405 అడుగుల నీటిమట్టంతో, 17 టీఎంసీల నీటి సామర్థ్యంతో ఉన్న నిజాంసాగర్‌ పూర్తి స్థాయి నీటిమట్టాన్ని అలాగే నిలకడగా కొనసాగిస్తున్న అధికారులు వస్తున్న వరదను దిగువనకు వదులుతున్నారు. అనేక ఏళ్ళ తర్వాత నిజాంసాగర్‌ నుంచి భారీగా నీటిని వదలుతున్నారు. వరదనీటితో దిగువన మంజిరా ఉప్పొంగి ప్రవహిస్తుంది. సాలూరా వద్ద పాత బ్రిడ్జిని దాటి నీరు ఉరకలు వేస్తోంది. ప్రమాద హెచ్చరికలు జారీ చేయడంతో మహారాష్ట్ర నుంచి నిజామాబాద్‌కు రాకపోకలను నిలిపివేశారు. మంజిరా పరిసర ప్రాంతాల్లో రెడ్‌ అలర్ట్‌ను జారీ చేశారు. ఇదిలా ఉంటే ఉమ్మడి జిల్లాలో ఉన్న అనేక వాగులు, వంకలు కూడా ఉరకలెత్తుతున్నాయి. భారీ వర్షంతో వాగులు, వంకలు పొంగి ప్రవహించడం తో రాకపోకలకు ఇబ్బందిగా మారింది. పలు చోట్ల రోడ్లపై నుంచి భారీగా వర్షం నీరు ప్రవహించడంతో రోడ్లు తెగిపోయాయి.

జిల్లాలో 84.6 మి.మీ. సరాసరి వర్షపాతం నమోదు

నిజామాబాద్‌ జిల్లాలో ఆదివారం ఒక్కరోజే 84.6 మి.మీ. వర్షపాతం నమోదైంది. అత్యధికంగా నవీపేట్‌ మండలంలో 176.8 మి.మీ. వర్షపాతం నమోదు కావడం విశేషం. అత్యల్పంగా రుద్రూర్‌ మండలంలో 39.0 మి.మీ. వర్షపాతం నమోదైంది. జిల్లా సరాసరి వర్షపాతం 1042.4 మి.మీ. కాగా ఆదివారం నాటికి 1417.9 మి.మీ. వర్షపాతం నమోదైంది. వాస్తవానికి ఆదివారం నాటికి జిల్లాలో 798.7 మి.మీ. వర్షపాతం కురువాల్సి ఉండగా రెట్టింపు వర్షపాతం ఇప్పటికే నమోదైంది. 29 మండలాల్లో అత్యధికంగా నవీపేట్‌ మండలంలో 145.7 శాతం వర్షం కురిసింది. 28 మండలాల్లో అత్యధిక వర్షపాతం నమోదయింది. ఒక్క రుద్రూర్‌ మండలంలోనే సాధారణ వర్షపాతం నమోదైంది. ఇంకా కొద్ది రోజులు తుపాన్‌ ప్రభావం దృష్ట్యా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున మరింత వర్షపాతం న మోదయ్యే అవకాశాలున్నాయి. కందకుర్తి వద్ద మహారాష్ట్ర-తెలంగాణ రాష్ట్రాలను కలుపుతూ ఉన్న బ్రిడ్జిపై నుంచి వరద ప్రవహిస్తుండడంతో రెండు రాష్ట్రాల మధ్య సంబంధాలు తెగిపోయినట్లయింది.

elangana

Advertisement

తాజా వార్తలు

Advertisement