Friday, November 22, 2024

NZB: కోత విధించిన మున్సిపల్ డ్రైవర్ల వేతనాలు చెల్లించాలి

నిజామాబాద్ సిటీ, ఆగస్ట్ 25 (ప్రభ న్యూస్): నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య డ్రైవర్ల వేతనాల్లో కోత విధించడాన్ని, రికవరీ చేసిన వేతనాలను చెల్లించాలని నగర మేయర్ ను మున్సిపల్ డ్రైవర్స్ యూనియన్ నాయకులు కోరారు. శుక్రవారం నిజామాబాద్ నగర లోని మేయర్ క్యాంప్ కార్యాలయంలో మున్సిపల్ డ్రైవర్స్ యూనియన్, తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో నగర మేయర్ దండు నీతూ కిరణ్ ని మర్యాదపూర్వకంగా కలసి తమ సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) రాష్ట్ర కార్యదర్శి మల్యాల గోవర్ధన్ మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం మేడే కానుకగా పారిశుధ్య కార్మికులకు వెయ్యి రూపాయలు వేతనాన్ని పెంచింది, పెంచిన వేతనాన్ని రెండు నెలలుగా మున్సిపల్ డ్రైవర్లకు చెల్లించి, మళ్లీ ఆ వేతనాలను రికవరీ చేయడం నిజామాబాద్ మున్సిపల్ పాలకవర్గ చరిత్రలో ఎప్పుడూ జరగలేదని మున్సిపల్ అధికారులు కొత్త ఆనవాయితీకి తెరతీసారని విమర్శించారు. రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీలలో చెల్లిస్తున్నట్టుగానే పారిశుద్ధ్య డ్రైవర్లకు కూడా వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. నగర మేయర్ నీతు కిరణ్ చంద్రశేఖర్ స్పందిస్తూ… ప్రభుత్వ పరంగా కార్మికులకు అందాల్సిన వేతనాలను తప్పకుండా చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ డ్రైవర్స్ యూనియన్ అధ్యక్షులు కే భూపతి, నాయకులు సర్వేశ్, చిరంజీవి, మహేష్, నవీన్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement