Friday, November 22, 2024

NZB | రోడ్డును ఆక్రమించి, దారిలేకుండా చేశారు.. హైకోర్టు చెప్పినా ప‌ట్టించుకోవ‌ట్లేదు

నిజామాబాద్ సిటీ, (ప్రభ న్యూస్): వ‌ర‌ద ముంపున‌కు గుర‌వుతున్న త‌మ ఊరును కాపాడాల్సిన స‌ర్పంచ్ కావాల‌ని ఇబ్బందులు సృష్టిస్తున్నార‌ని, క‌నీసం త‌మ‌కు న‌డ‌క దారి కూడా లేకుండా చేస్తున్నార‌ని బాధిత కుటుంబాల వారు ఆందోళ‌న‌కు దిగారు. ఇవ్వాల (సోమ‌వారం) నిజామాబాద్ జిల్లా క‌లెక్ట‌రేట్ వ‌ద్ద 50 కుటుంబాల వారు ధ‌ర్నా నిర్వ‌హించి అధికారుల‌కు విన‌తిప‌త్రం అంద‌జేశారు. డొంకేశ్వ‌ర్ గ్రామం నుంచి మెయిన్ రోడ్డుకు వెళ్లేందుకు ఉన్న ఒకే ఒక్క ర‌హ‌దారిని మూసివేస్తే తాము ఎలా బ‌య‌ట‌కు వెళ్లాల‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఈ విష‌యంలో హైకోర్టు నుంచి స్టే ఆర్డ‌ర్ తీసుకొచ్చినా ప‌ట్టించుకోవ‌డం లేద‌ని, కోర్టు ధిక్క‌ర‌ణ‌కు పాల్ప‌డుతున్నార‌ని తెలిపారు.

త‌మ ఇండ్ల‌కు వెళ్లేందుకు దారి ఇవ్వకుండా కోర్టు ధిక్కారానికి పాల్ప‌డుతున్న వారిపై చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డోoకేశ్వర్ మాజీ సర్పంచ్ హరిదాస్ అన్నారు. డొంకేశ్వర్ గ్రామం నుంచి రోడ్డు సమస్యను పరిష్కరించాలని కోరుతూ కలెక్టరేట్ ఎదుట 50మందితో ధర్నా నిర్వహిం చి, ఏవోకు వినతిపత్రం అందజేశారు. డొంకే శ్వర్ గ్రామం ముంపునకు గురై 50 సంవత్సరాలు కావస్తున్న అక్కడున్న‌ ఖాళీ స్థలంలో 50 మంది కుటుంబాలకు మెయిన్ రోడ్ కు వెళ్లేందుకు, ఇంటి రాకపోకలకు ఉన్న దారిని క్లోజ్ చేస్తున్నార‌ని తెలిపారు. సర్పంచ్, కార్యదర్శి, ఎంపిఓ, వీడీసీ సభ్యులు ఆ స్థలంలో కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టేందుకు గుంతలు తవ్వారని పేర్కొన్నారు.

అక్కడ కాంప్లెక్స్ నిర్మాణం చేపడితే 50 కుటుంబాల వారు ఇంటికి వెళ్లడానికి దారి ఉండదని పలుమార్లు విన్నవించినా పట్టించుకోలేదని వాపోయారు. అదేవిధంగా ఈ సమస్యపై డీపీవో జయసుధను కలిసి వినతి పత్రాన్ని అందజేసినా సమస్య పరిష్కారం చూప‌లేద‌న్నారు. హైకోర్టు నుంచి స్టే ఆర్డర్ తెచ్చుకున్నప్పటికీ దౌర్జన్యంగా కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టడానికి మొరం కుప్పలు పోసి ఇబ్బందుల‌కు గురిచేస్తున్నార‌ని, ఈ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించాల‌ని క‌లెక్ట‌ర్‌ను కోరారు. లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళనా కార్యక్ర మాలు చేపడతామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement