Wednesday, September 25, 2024

NZB: ఆ దుకాణానికి అగ్నిమాపక శాఖ అనుమతి లేదు…

నిజామాబాద్ ప్రతినిధి, సెప్టెంబర్ 25 (ప్రభ న్యూస్): అగ్నిమాపక శాఖకు సంబంధించిన నిబంధనలు పాటించని వస్త్ర షో రూమ్ కు నోటీసులు జారీ చేసినట్లు జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి గౌతమ్ తెలిపారు. నిజామాబాద్ నగరంలో రాష్ట్రపతి రోడ్డు వద్దగల వస్త్ర షోరూం ఈనెల 26న సినీ తార నేహా శెట్టితో ప్రారంభోత్సవం చేయనున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రాష్ట్రపతి రోడ్డులో హంగు ఆర్భాటాలతో ఇరుకు రోడ్డులో.. బహుళ అంతస్తుల భవనాన్ని నిర్మించిన వస్త్ర భవన నిర్మాణం అక్రమమేనని కార్పోరేషన్ తేల్చి నోటీసులు ఇచ్చిన విషయం విధితమే.

కానీ కార్పోరేషన్ నిబంధనలు తుంగలో తొక్కడమే కాకుండా అగ్నిమాపక శాఖకు సంబంధించిన.. అనుమతి లేకుండానే, నిబంధనలు పాటించకుండానే భవన నిర్మాణాన్ని పూర్తిచేసి ప్రారంభోత్సవానికి సదరు వస్త్ర షోరూమ్ నిర్వాహకుడు సిద్ధమయ్యాడు. నిత్యం రద్దీగా ఉండే ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న ఈ వస్త్ర షోరూం ఎలాంటి సెట్ బ్యాక్ లేకుండానే నిర్మించడం కొస మెరుపు. భవన నిర్మాణం ప్రారంభించి రెండు సంవత్సరాలు.. నిర్మాణ పనులు పూర్తయి ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. కానీ ఇప్పటివరకు కనీసం అగ్నిమాపక శాఖ నుంచి ఎలాంటి అనుమతి తీసుకోకపోవడం శోచనీయం.

బుధవారం రాష్ట్రపతి రోడ్డు వద్ద గల వస్త్ర షో రూమ్ ని అగ్నిమాపకశాఖ అధికారులు పరిశీలించారు. అగ్ని ప్రమాదం జరిగితే ఎలాంటి జాగ్రత్త చర్యలు చేపట్టారో పరిశీలించారు. అనంతరం నిబంధనలు పాటించని వస్త్ర షో రూమ్ కి అగ్నిమాపక శాఖ నుంచి నోటీసులు జారీ చేశారు. ఈ సందర్భంగా అగ్నిమాపక శాఖ అధికారి మాట్లాడుతూ… అగ్నిమాపక శాఖ నిబంధనలు పాటించని వస్త్ర షో రూమ్ కి నోటీసులు జారీ చేశామని చెప్పారు.

- Advertisement -

షోరూం ప్రారంభోత్సవానికి సిద్ధమైనా ఇప్పటివరకు అగ్నిమాపక శాఖ నుంచి ఎలాంటి అనుమతి తీసుకోలేదని చెప్పా రు. షోరూం కి కనీసం సెట్ బ్యాక్ లేదని, అలాగే కొన్ని నిబంధనలను పాటించలేదని తెలిపారు. నోటీసులు ఇచ్చిన 30రోజుల్లో అగ్నిమాపక శాఖకు అనుమతితో పాటు పూర్తి నిబంధనలు పాటించని యెడల రెండవ నోటీసు జారీ చేస్తామని ఈ సందర్భంగా అధికారి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement