నిజామాబాద్ ప్రతినిధి, (ఆంధ్రప్రభ) : ఎన్నికలు వస్తున్నందునే వలస పక్షులు మళ్లీ వాలుతున్నాయని, వచ్చే ఎన్నికల్లో కాషాయం జెండా ఎగరడం ఖాయమని నిజామాబాద్ ఫ్లోర్ లీడర్ స్రవంతి రెడ్డి అన్నారు. సోమవారం నిజామాబాద్ జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో స్రవంతి రెడ్డి మాట్లాడుతూ…. ప్రజల ఇబ్బందులు పరిష్కరించడానికే ప్రజలు కాంగ్రెస్ కి పట్టం కట్టారని కవిత అంటున్నారని, గత పదేళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం ఏమి చేయలేదని కవిత ఒప్పుకున్నారన్నారు.
గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి శూన్యమని, కుటుంబ పాలన, ప్రజా ప్రతి నిధుల ఇండ్లపై దాడులు, లిక్కర్ స్కాం లతో కాలం వెళ్ల దీశారన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలకు హామీల అమల మీద ఎలాంటి చిత్తశుద్ధి లేదని అన్నారు. ‘‘పీపుల్ ఫ్రెండ్లీ పోలీసింగ్’’ గురించి కవిత మాట్లాడడం హాస్యా స్పదంగా ఉందని, పోలీసు వ్యవస్థని నిర్వీర్యం చేసిందే కేసీఆర్ సర్కార్ అన్నారు.
బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పోలీసింగ్ ఉండేదని, ఇప్పుడు కాంగ్రెస్ సర్కారులో కాంగ్రెస్ పోలీసింగ్ లా పోలీసు వ్యవస్థ తయారైందన్నారు. కెసిఆర్ విధానాలను అమలు చేయమని కాంగ్రెస్ సర్కారుని కవిత కోరుతున్నారని, ప్రస్తుతం రేవంత్ సర్కార్ ప్రజల వాగ్దానాలను గాలికి వదిలేసి అదే ఫార్ములాను పాటిస్తున్నాడన్నారు.
భయపడే రక్తం కాదని కవిత అంటున్నారని, ఆమెది జలగల్లా పిలిచే రక్తమని వ్యాఖ్యలు చేశారు. కెసిఆర్ కి కేటీఆర్ కి భయం లేకపోతే క్వాష్ పిటిషన్ ఎందుకు వేశారని ప్రశ్నించారు. నిజామాబాద్ పవర్ ఏందో చూపిస్తామని కవిత అంటున్నారని, 2019 పార్లమెంట్, 2020 కార్పొరేషన్ ఎన్నికల్లోనే నిజామాబాద్ పవర్ ఏందో ప్రజలు చూయించారన్నారు.
బీఆర్ఎస్ నిజామాబాద్ లో ఎప్పుడో ఖతం అయిపోయిందని, వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు సైతం దొరకరని ఎద్దేవా చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎగిరేది భారతీయ జనతా పార్టీ జెండానే అన్నారు. గత ఎన్నికల్లో మేయర్ స్థానాన్ని తృటిలో కోల్పోయామని , ఈసారి పూర్తి మెజారిటీతో మేయ స్థానాన్ని కైవసం చేసుకుంటామని స్రవంతి రెడ్డి పేర్కొన్నారు. ఈ సమావే శంలో భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లు, నాయ కులు పాల్గొన్నారు.