నిజామాబాద్ ప్రతినిధి, జులై 11(ప్రభ న్యూస్) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి పాడాల భోజా గౌడ్, అధ్యక్షులు పండరినాథ్ కోరారు. గురువారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని అదనపు కలెక్టర్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేసి మాట్లాడారు. ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ పొందుపరిచిన విధంగా ముఖ్యమంత్రి ప్రతినెలా మొదటి తేదీన పెన్షనర్లకు పెన్షన్లు చెల్లించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. పెన్షనర్ల ముఖ్యమైన ఆందోళనకరమైన సమస్య, నగదు రహిత వైద్య సమస్య అని తెలిపారు. ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ ద్వారా పెన్షనర్ల మూల పెన్షన్ నుండి 1 శాతం మినహాయించి సహృదయంతో వెంటనే నగదు రహిత వైద్య చికిత్స అందించే ఏర్పాటు చేయాలని కోరారు.
పెన్షనర్లకు రావాలసిన డియర్ నెస్ రిలీఫ్ నాలుగు వాయిదాలు విడుదల చేసి ఏక మొత్తంలో బకాయిలు చెల్లించాలని కోరారు. పెన్షనర్ల మిగతా సమస్యలపై ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్ ఉద్యోగుల సంఘం నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో స్టేట్ వైస్ ప్రెసిడెంట్ జి.శ్రీనివాస్ రెడ్డి, ఆర్మూర్ అధ్యక్షులు జ్ఞానేశ్వర్, ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ రెడ్డి, బోధన్ ప్రధాన కార్యదర్శి ఎం రాజేశ్వరరావు, నిజామాబాద్ అధ్యక్షులు జగత్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి దయాకర్ రావు, భీంగల్ అధ్యక్షులు గంగారాం, ప్రధాన కార్యదర్శి మురారి, ఉద్యోగుల సంఘం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.