నిజామాబాద్ ప్రతినిధి (ప్రభ న్యూస్) : యజమానిని మోసం చేసి వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రైల్వే ఎస్సై సాయిరెడ్డి మాట్లాడుతూ… గత నెల 28న నాందేడ్‌కు చెందిన రాహుల్ అనే వెండి వ్యాపారి 14.5 కిలోల వెండి ఆభరణాలను పాలిష్ చేయించేందుకు తన ఉద్యోగులు సునీల్, నదీమ్‌లను హైదరాబాద్‌కు పంపాడు.
అయితే ఈ ప్రయాణంలో సునీల్ గడ నిద్రలో ఉండగా.. నదీమ్ దురుద్దేశంతో 14.500 కిలోల వెండి ఆభరణాలను దోచుకుని పారిపోయాడు. సునీల్ యజమాకి సమాచారం ఇవ్వడంతో ఈ నెల 3న నిజామాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్లో రాహుల్ ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు.
అయితే, సోమవారం ఉదయం దొంగలించిన వెండి ఆభరణాలు విక్రయించేందుకు నదీమ్ నిజామాబాద్ రైల్వేస్టేషన్‌కు రాగా.. డ్యూటీలో ఉన్న రైల్వే కానిస్టేబుల్స్‌కు అనుమానం వచ్చి ప్రశ్నించారు. ఈ క్రమంలో నదీమ్ పారిపోయేందుకు ప్రయత్నించగా.. రైల్వే పోలీసులు పట్టుకుని విచారించారు.
విచారణలో నేరం అంగీకరించడంతో నదీమ్‌ను రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. అయితే నదీమ్ వద్ద కేవలం 10 కిలోల వెండి ఆభరణాలు మాత్రమే లభ్యమయ్యాయి. మిగిలిన నాలుగున్నర కేజీల వెండి ఆభరణాలను ఇతరులకు విక్రయించినట్లు నదీమ్ చెప్పినట్లు రైల్వే పోలీసులు తెలిపారు.