బాన్సువాడ, జులై 15 ప్రభ న్యూస్ : ఆరోగ్యవంతమైన సమాజం కోసం కృషి చేస్తానని శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బాన్సువాడ పట్టణంలోని ఏరియా ఆసుపత్రిలో జరిగిన అభివృద్ధి కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.మొదటగా మూడు కోట్లతో నిర్మించిన ఫుట్ ఓవర్ బ్రిడ్జి, రూ.1.5 కోట్లతో ఏర్పాటు చేసిన 10 బెడ్స్ డయాలసిస్ యూనిట్, రూ.27 లక్షలతో ఏర్పాటు చేసిన స్పెషల్ న్యూ బార్న్ కేర్ యూనిట్, ఐదు లక్షలతో నిర్మించిన రోగుల నాయకుల షెడ్డు, డి ఈ ఐ సి వార్డులను సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ లు ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన ఆస్పత్రి ఆవరణలో సమావేశంలో ఆయన ప్రసంగించారు. అక్కడే ఉన్న అందరి రోగులకు ప్రతి వైద్య అధికారులను పరిచయం చేశారు.
అంతకుముందు ఏరియా ఆసుపత్రిలో ఖాళీలు ఏమైనా ఉంటే తెలుపాలంటూ సూపర్డెంట్ శ్రీనివాస్ ప్రసాద్ ను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పరంగా ముఖ్యమంత్రి కేసీఆర్, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు సహాయ సహకారాలతో అన్ని హంగులతో జిల్లా కేంద్రంలో ఉన్న వసతులతో కూడిన ఆసుపత్రిని నిర్మించుకున్నామని ఆయన ప్రజలకు వివరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన వైద్య సేవల కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేసి అన్ని ఆధునికత వసతులున్న ఆసుపత్రిగా నిర్వహించుకున్నామని ఆయన సిబ్బంది వైద్య అధికారుల సేవలు, రోగులకు ఇబ్బందులు లేకుండా సేవ చేస్తున్నారని కొనియాడారు. ఆరోగ్యవంతమైన సమాజం కోసం అహర్నిశలు ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి అమోఘమని సభాపతి అన్నారు. చెట్టులాగా తల్లి బాగుంటేనే పిల్లలు ఆరోగ్యవంతమైన పిల్లలు జన్మిస్తారని ఆయన అన్నారు.
తల్లి పాలలో ఎంతగానో ప్రోటీన్లు ఉన్నాయని తల్లి పాలు తాగితేనే పిల్లలు ఆరోగ్యం, అందంగా ఉంటారని ఆయన అన్నారు. ఎలాంటి సిజరిన్ లేకుండా ప్రభుత్వ ఆసుపత్రిలోనే బాన్సువాడ ఏరియా ఆసుపత్రిలో గ్రామీణ ప్రాంతాల నుండి ఎల్లారెడ్డి, జుక్కల్, మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుండి గర్భిణీ స్త్రీలు వచ్చి ప్రసవాలు 400కు పైగా జరుగుతున్నాయని ఆయన అన్నారు. నెల నిండకుండానే ముందు పుట్టిన శిశువులు బ్రతకాలంటే చాలా కష్టాలు ఉండేవని, హైదరాబాద్ ప్రాంతాలకు వెళ్లాలంటే గ్రామీణ నిరుపేదలకు డబ్బులు పెట్టే స్తోమత లేక ఎంతోమంది కష్టాల పాలైన సంఘటనలున్నాయని, వాటిని దృష్టిలో పెట్టుకొని ఆ సెంటర్ ను డి. సి. సి. సెంటర్ ను కూడా బాన్సువాడలోనే ఏర్పాటు చేశామని ఆయన అన్నారు.
తల్లి గర్భంలో శిశువు ఎలా ఉందో గుర్తించే మిషన్ ను కూడా తెలంగాణ రాష్ట్రంలోనే 14 సెంటర్లలో ఉండగా దాంట్లో బాన్సువాడ లో ఒక మిషిన్ ఏర్పాటు చేసిన ఘనత ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావుదని ఆయన అన్నారు. డయాలసిస్ సెంటర్ ను 10 బెడ్లకు పెంచుతూ ఈ గ్రామీణ ప్రాంతాల నుండి డయాలసిస్ రోగులకు మెరుగైన వైద్యం కోసం ఐదు నుండి పది బెడ్లకు పెంచుతూ ఈ రోజు ప్రారంభించామని ఆయన పేర్కొన్నారు. ఏరియా ఆసుపత్రి నుండి మాతా శిశు ఆసుపత్రికి పుట్ ఓవర్ బ్రిడ్జి ప్రజలకు సౌకర్యం కోసం మూడు కోట్లతో ఈ బ్రిడ్జి నిర్మించామని ఆయన అన్నారు. ఈ బ్రిడ్జి పైన చెత్తాచెదారం వేయకుండా నిద్రించకుండా నడవడానికి వీలుగా, శుభ్రంగా ఉంచుకోవాలని రోగులకు ఆయన కోరారు. చిన్నారులకు సౌకర్యార్థం కోసమే ఈ బ్రిడ్జి నిర్మించడం జరిగిందని అన్నారు. తాను శాసనసభ్యుడు అయినప్పుడు 1996లో నిర్మించిన ప్రస్తుత ఏరియా ఆసుపత్రి భవనం పాతదైందని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడంతో త్వరలో 37. 50 కోట్లతో నూతనంగా భవనం నిర్మించడానికి అనుమతులు మంజూరు అవుతాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లాల డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, కామారెడ్డి జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు అంజిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, బాన్సువాడ ఎంపీపీ దొడ్ల నీరజ వెంకటరామిరెడ్డి, సొసైటీ చైర్మన్ ఏర్వలకృష్ణారెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ మోహన్ నాయక్, ఆర్యవైశ్య జిల్లా అధ్యక్షులు పాత బాలకృష్ణ, బుల్లెట్ రాజు, తదితరులు పాల్గొన్నారు.