Saturday, September 14, 2024

NZB: సీజనల్ వ్యాధుల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు… క‌లెక్ట‌ర్

నిజామాబాద్ ప్రతినిధి, ఆగస్టు 27(ప్రభ న్యూస్) : ప్రస్తుత వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల నియంత్రణకు కట్టుదిట్టంగా కృషి చేస్తూ, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు వైద్యాధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని కలెక్టర్ మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా ఆసుపత్రిలోని అవుట్ పేషంట్, ఇన్ పేషంట్ విభాగాలను, ఫీవర్ వార్డు, ఆపరేషన్ థియేటర్, శస్త్ర చికిత్స వార్డు, రక్త నిధి కేంద్రం, సెంట్రల్ ల్యాబ్, ఎలిసా టెస్ట్ సెంటర్, టీ.హబ్ సెంటర్ తదితర వాటిని సందర్శించి వాటి పనితీరును పరిశీలించారు. ప్రతిరోజూ సగటున ఎంతమంది రోగులు ఆసుపత్రికి వస్తున్నారు, వారిలో ఎంతమంది ఇన్ పేషంట్లుగా అడ్మిట్ అవుతున్నారు, డెంగ్యూ, మలేరియా, విషజ్వరాలు వంటి వాటితో ఎంతమంది ఆసుపత్రిలో చికిత్సలు పొందుతున్నారు తదితర వివరాలను ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమరాజ్ ను అడిగి తెలుసుకున్నారు.

- Advertisement -

రోగుల అవసరాలకు సరిపడా మందులు, ప్లాస్మా, ప్లేట్ లెట్ యూనిట్స్ అందుబాటులో ఉన్నాయా అని ఆరా తీశారు. ఆయా విభాగాల వారీగా అందిస్తున్న వైద్య సేవల పట్ల కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఫీవర్ వార్డులో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించి, వారికి అందుతున్న వైద్యసదుపాయాల గురించి వాకబు చేశారు. బ్లడ్ శాంపిల్స్ సేకరించి, వాటిని పరీక్షించిన అనంతరం రోగులకు అందిస్తున్న రిపోర్టులు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. ఆన్ లైన్ పద్ధతిలో నిర్వహిస్తున్న ఓ.పీ రిజిస్ట్రేషన్ విధానాన్ని పరిశీలించిన కలెక్టర్, అధికారులకు పలు సూచనలు చేశారు.


ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ… వర్షాకాలం అయినందున సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా అధికారులను అప్రమత్తం చేశామన్నారు. జిల్లా వ్యాప్తంగా స్వచ్ఛదనం – పచ్చదనం కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించడమే కాకుండా, పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తున్నామన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలు పాటించాల్సిన జాగ్రత్తలపై వారికి క్షేత్రస్థాయిలో అవగాహన కల్పిస్తున్నామన్నారు. ముఖ్యంగా జ్వరాలతో ఆసుపత్రులకు వచ్చే ప్రతి ఒక్కరికి రక్త నమూనాల సేకరణ, ఇతర వైద్య పరీక్షలు నిర్వహించి డెంగ్యూ, మలేరియా, వైరల్ ఫీవర్, డయేరియా వంటి వ్యాధులు వ్యాప్తి చెందకుండా, మెరుగైన వైద్య సేవలు అందించేలా పర్యవేక్షణ కొనసాగిస్తున్నామని తెలిపారు.

సీజనల్ వ్యాధుల తీవ్రతను దృష్టిలో పేరుకుని జీజీహెచ్ లో 24 గంటల పాటు వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామన్నారు. జీజీహెచ్ తో పాటు జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, సీహెచ్సీలు, పీహెచ్సీలలో ప్రత్యేకంగా ఫీవర్ వార్డులను నెలకొల్పి సీజనల్ వ్యాధులతో ఇబ్బందులు పడుతున్న వారికి మెరుగైన వైద్య సేవలు అందేలా కృషి చేస్తున్నామన్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లోనూ సీజనల్ వ్యాధులకు సంబంధించిన రోగుల వివరాలను కూడా రోజువారీగా తెప్పించుకుని, వారికి అందిస్తున్న వైద్య సేవలను జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులచే నిశితంగా పర్యవేక్షణ జరిపిస్తున్నామని కలెక్టర్ వివరించారు. అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ లో వైద్య చికిత్సలకు నిర్ణీత రుసుము మాత్రమే వసూలు చేయాలని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా కలెక్టర్ స్పష్టం చేశారు.

కాగా, ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో అన్ని రకాల అధునాతన వైద్య పరికరాలు, ఎలిసా టెస్టింగ్, ప్లాస్మా, ప్లేట్లెట్స్ సెపరేషన్ వంటి యంత్రాలు అందుబాటులో ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకుని ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని వైద్యాధికారులకు హితవు పలికారు. జీజీహెచ్ లో మౌలిక వసతుల మెరుగుదలకు సంబంధించిన ప్రతిపాదనలపై అధికారులతో చర్చించి కీలక ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ వెంట జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారిని డాక్టర్ రాజశ్రీ, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శివప్రసాద్ తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement