హైదరాబాద్, ఆంధ్రప్రభ: బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు మరోసారి అస్వస్థతకు గురయ్యారు. గురువారం ఉదయం విద్యార్థులు అల్పాహారంలో ఉత్తప్ప తిన్న తర్వాత వాంతులు, కడుపునొప్పి, తలనొప్పితో అనారోగ్యం పాలయ్యారు. ఫుడ్‌పాయిజన్ కారణంగానే అస్వస్థతకు గురైనట్లు సమాచారం. దాదాపు 50 మందికిపైగా విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు సమాచారం. గత కొన్ని రోజులుగా ట్రిపుల్ ఐటీని సమస్యలు వెంటాడుతున్నాయి. నెల రోజుల క్రితం దాదాపు 500 మంది విద్యార్థుల ఫుడ్ పాయిజన్ ఘటన విద్యార్థుల ఆందోళనకు దారితీసిన విషయం తెలిసిందే. దాంతో వారం రోజుల పాటు విద్యార్థులు నిరసన తెలిపారు. సబితా ఇంద్రారెడ్డి స్వయంగా వర్సిటీకి వెళ్లి హామీ ఇవ్వడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు.
మంత్రి హామీ ఇచ్చి దాదాపు నెల రోజులు కావొస్తున్నా ఇంకా సమస్యలు పరిష్కారం కాలేదని విద్యార్థులు పేర్కొంటున్నారు. తిండి, వసతులు లేక అవస్థలు పడుతుంటే ప్రభుత్వం పట్టించుకోవట్లేదని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గురువారం మరోసారి 50 మంది వరకు విద్యార్థులు అస్వస్థకు గురవ్వడంతో విద్యార్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. వర్సిటీ వైద్యురాలు మాత్రం స్పందిస్తూ వర్సిటీలో ఫుడ్‌పాయిజన్ కాలేదన్నారు. అస్వస్థతకు గురైంది 50 మంది కాదని, ఆరుగురు మాత్రమేనని మీడియాకు తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.