నిజామాబాద్ సిటీ, (ప్రభ న్యూస్): కాంగ్రెస్ పార్టీ చేవెళ్లలో నిర్వహించిన ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ చారిత్రాత్మకమని నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ ఎస్టీ సెల్ చైర్మన్ కేతావత్ యాదగిరి అన్నారు. ఆదివారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో దేశ ప్రధానులుగా పనిచేసిన జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీలు, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అడుగు జాడల్లో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ, ఎస్టీల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు ఈ డిక్లరేషన్ ను చేసిందన్నారు.
జనాభా ప్రతిపాధికన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఎస్సీ రిజర్వేషన్లు 18 శాతానికి, ఎస్టీలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు. అంబేద్కర్ అభయహస్తం కింద 12లక్షల ఆర్థిక సహాయం, ఇండ్లులేని వారికి ఇంటి స్థలంతో పాటు 6లక్షల నగదు అందజేస్తామని, అనైన్డ్ భూముల పునరుద్ధరణ, పోడుపట్టాల పంపిణీ చేస్తామని ఈ డిక్లరేషన్ ద్వారా ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖార్గే ప్రకటించడం గొప్ప విషయమన్నారు.