Friday, November 22, 2024

NZB: రాజీవ్ ఆరోగ్యశ్రీ, మహాలక్ష్మీ పథకాలను ప్రారంభించిన కలెక్టర్

నిజామాబాద్ సిటీ, డిసెంబర్ 9 (ప్రభ న్యూస్) : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు, మహిళలకు ఉచిత ప్రయాణ వసతి కల్పిస్తూ అందుబాటులోకి తెచ్చిన మహాలక్ష్మి పథకాలను జిల్లా స్థాయిలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శనివారం లాంఛనంగా ప్రారంభించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ముందుగా రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు పథకాన్ని ప్రారంభించిన అనంతరం మహాలక్ష్మి పథకానికి శ్రీకారం చుట్టారు. మహిళలకు ఉచిత ప్రయాణ వసతి కల్పిస్తూ ఏర్పాటు చేసిన ఆర్టీసీ బస్సుకు కలెక్టర్ పచ్చజెండా ఊపి పథకాన్ని ప్రారంభించారు. మహిళలు, బాలికలు, విద్యార్థినులతో కలిసి జిల్లా జనరల్ ఆసుపత్రి నుండి ఆర్టీసీ బస్టాండ్ వరకు కలెక్టర్ సైతం బస్సులో ప్రయాణం చేశారు. బస్సులోని మహిళలకు ఎలాంటి చార్జీలు లేకుండా జీరో ఫేర్ తో కూడిన మహాలక్ష్మి టికెట్ లను కలెక్టర్ స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా ఉత్సాహ భరిత వాతావరణం నెలకొంది. ఉచిత రవాణా వసతిని అందుబాటులోకి తేవడం పట్ల మహిళలు హర్షాతిరేకాలు వెలిబుచ్చుతూ, ప్రభుత్వానికి అనుకూలంగా నినాదాలు చేశారు. ప్రయాణ ప్రాంగణంలో పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చారు.

ప్రతిష్టాత్మక పథకాలను ప్రారంభించిన సందర్భంగా జిల్లా పాలనాధికారి రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ… రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం పరిమితిని ప్రభుత్వం రూ.5లక్షల నుండి రూ.10 లక్షలకు పెంచిందని, ప్రతి నిరుపేద కుటుంబానికి సాలీనా పది లక్షల రూపాయల వరకు విలువ చేసే వైద్య సేవలను ఈ పథకం ద్వారా ఉచితంగా అందించడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలోని అర్హులైన ప్రతి కుటుంబానికి పరిమితి పెంపుతో కూడిన రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని వర్తింపజేసేలా పకడ్బందీ చర్యలు చేపట్టామన్నారు. అలాగే మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం అందుబాటులోకి వచ్చిందన్నారు. వయసుతో నిమిత్తం లేకుండా మహిళలు, బాలికలు, యువతులు తెలంగాణ వ్యాప్తంగా ఉచితంగా ప్రయాణం చేయవచ్చని, ట్రాన్స్ జెండర్లకు కూడా ఉచిత రవాణా వసతి వర్తిస్తుందని తెలిపారు. ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, ఎలెక్షన్ ఐ.డీ వంటి ఏదైనా గుర్తింపు కార్డును చూపించి ఉచిత ప్రయాణ సదుపాయాన్ని పొందవచ్చన్నారు.
ఈ కార్యక్రమాల్లో ఆర్టీసీ ఆర్ఎం జాన్ రెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సుదర్శనం, జిజిహెచ్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమరాజ్, నాయకులు మానాల మోహన్ రెడ్డి, తాహెర్ బిన్ హందాన్, రత్నాకర్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement