Friday, November 22, 2024

TS: రైల్వే గేట్ ను వెంటనే తెరిపించాలి.. దక్షిణ మధ్య రైల్వే జిఎంకి వినతిపత్రం

నిజామాబాద్ సిటీ, సెప్టెంబర్ 9 (ప్రభ న్యూస్) : నిజామాబాద్ పట్టణంలోని గాంధీగంజ్, శ్రద్ధానంద్ గంజ్ మధ్యలో ఉన్న రైల్వే గేట్ ను వెంటనే తెరిపించాలని రైల్వే గేట్ పరిరక్షణ సమితి అధ్యక్షులు కోనేరు సాయికుమార్, సర్వ సమాజ్ కన్వీనర్ అదే ప్రవీణ్ లు దక్షిణ మధ్య రైల్వే జిఎం అరుణ్ ను కోరారు. శనివారం నిజాంబాద్ జిల్లా సందర్శనకు వచ్చిన దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ ను రైల్వే పరిరక్షణ సమితి స్థానిక వ్యాపారులు, కూలీలు కలిసి వినతిపత్రం అందజేసి మాట్లాడారు. రైల్వే గేటు గాంధీ గంజ్ కు శ్రద్ధానంద్ గంజ్ కు.. శివాజీ నగర్ నుండి దుబ్బా వరకు అనుసంధానం చేస్తూ నగర పురపాలక సంఘం ఏర్పడిన మొట్టమొదటి యాక్షన్ ప్లాన్, మాస్టర్ ప్లాన్ ఉన్న ఏకైక రైల్వే గేటు ఇది అని తెలిపారు.

ఈ రైల్వే గేటు గుండా నిత్యం వేలాది మంది పాదాచారులు, వాహన దారులు నిత్యం ఉదయం నుండి అర్ధరాత్రి వరకు ఈ రేల్వే గేటు ద్వారానే ప్రయాణాలు సాగిస్తుంటారన్నారు. ఒక నాడు ఒక లక్ష చిల్లర ఉన్నటువంటి పట్టణ జనాభా నేడు నాలుగున్నర నుండి దాదాపు ఐదు లక్షలకు చేరిందని తెలిపారు. ఈ రైల్వే గేటుకు ఇరువైపులా గాంధీగంజ్, శ్రద్ధానంద్ గంజ్ లు కలవన్నారు. ఈ గంజ్ లోకి ప్రతి రోజు ఉమ్మడి జిల్లాలో మారుమూల గ్రామాల నుండే కాకుండా ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ తదితర జిల్లాల నుండి ఇదే రైల్వే గేటు నుండి వేలాది మంది రాకపోకలు సాగిస్తుంటారని పేర్కొన్నారు. ఈ రైల్వే గేటుకు ఇరువైపులా వందలాది మంది వ్యాపారులు, దుకాణదారులు ఫుట్పాత్ వ్యాపారులు, సినిమా ధియేటర్లు ఉన్నాయని పేర్కొన్నారు. ఇదే కాకుండా ఈ గేటుకు ఒక వైపు నిజామాబాద్ పట్టణంలో రిటైల్ కూరగాయల దుకాణాలు.. మరొక వైపు ఇవే కూరగాయల హోల్ సేల్ కూరగాయల మార్కెట్ గేటు కు అటువైపున శ్రద్ధానంద్ గంజ్లో జరుగుతుందన్నారు.

అంతేగాకుండా నిత్యం నిజామాబాద్ పట్టణంలో ఉన్నటువంటి ఏకైక సార్వజనిక్ గణేష్ మందిరం ఈ రైల్వే గేటుకు ప్రక్కనే ఉంది. ఈ ఆలయానికి వచ్చు వందలాది భక్తులు ఈ గేటు గుండా వచ్చి దర్శనం చేసుకుంటారని… తరతరాలుగా ప్రతి సంవత్సరం వినాయక నిమజ్జనం (శోభాయాత్ర) దుబ్బా నుండి ప్రారం భమై ఇదే రైల్వే గేటు నుండి వినాయక్ నగర్ కు చేరుతుందన్నారు. ప్రతిసంవత్సరం ఆషాడంలో జరిగే ఊరపండుగ (గ్రామ దేవతల ఊరేగింపు) ఖిల్లా నుండి ప్రారంభమై పెద్దమ్మతల్లి విగ్రహాన్ని దుబ్బా వరకు ఇదే రైల్వే గేటు గుండా ప్రజలు భక్తి శ్రద్దలతో రోడ్డుకి ఇరువైపుల నిలబడి దేవతలకు మొక్కులను చెల్లించుకొని ఈ రైల్వే గేటు మార్గం ద్వారానే వెళ్తారన్నారు. అంతేగాకుండా ఈ రైల్వే గేటుకు ఇరువైపులా ప్రైమరీ స్కూల్, ఇంటర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, ప్రభుత్వ గిరిరాజ్ కాలేజీ, హరిచరణ్ డిగ్రీ కాలేజ్ కు వెళ్ళడానికి ఈ రైల్వే గుండానే విద్యార్ధులు నిత్యం ప్రయాణం సాగిస్తుంటారనీ తెలిపారు.

- Advertisement -

ఇంతటి ప్రాధాన్యం ఉన్న దాదాపు శతాబ్ది సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ రైల్వే గేటును మూసి ఉంచడం వలన ఇరువైపులా ఉన్నటువంటి భక్తులు, ప్రజానీకం, కాలనీ వాసులు, వాహనదారులు, విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారనీ వాపోయారు.. వ్యాపారులకు వ్యాపారం లేక వారి ఇల్లు గడవడం కష్టంగా ఉన్నది. ముఖ్యంగా తోపుడు బండ్లు, రిక్షా పుల్లర్స్, రోజ్ గార్ కోల్పోయి కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే స్పందించి మూసివేసి ఉంచిన రైల్వే గేటును వెంటనే తెరిపించి ప్రజలను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక కూలీలు వ్యాపారులు రైల్వే గేట్ పరిరక్షణ సమితి నాయకులు, బుస్సాపూర్ అశోక్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement