Thursday, November 21, 2024

NZB: ప్రజాపాలన అందరికీ అభయహస్తం… మాజీ మంత్రి షబ్బీర్ అలీ

నిజామాబాద్ సిటీ, జనవరి 5 (ప్రభ న్యూస్): ప్రజాపాలన అందరికీ… తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అభయ హస్తమని, కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల నేస్తమని మాజీ మంత్రి, అర్బన్ ఇంచార్జ్ మహమ్మద్ అలీ షబ్బీర్ అన్నారు. ప్రజాపాలన కార్యక్రమానికి ప్రజల నుండి అనూహ్య స్పందన వచ్చిందని.. ప్రజాపాలన పొడిగింపుపై సీఎంతో చర్చిస్తామన్నారు. శుక్రవారం నిజామాబాద్ అర్బన్ లో ఆరు గ్యారంటీల దరఖాస్తు స్వీకరణను మాజీ మంత్రి నిజామాబాద్ అర్బన్ ఇంచార్జ్ మహమ్మద్ అలీ షబ్బీర్ పరిశీలించారు.

ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. ఇది దొరల ప్రభుత్వం కాదు.. ప్రజల ప్రభుత్వమన్నారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని తెలిపారు. ప్రజల దగ్గరికే వెళ్లి దరఖాస్తులు స్వీకరిస్తున్నాం…అర్హత ఉన్న వారందరూ దరఖాస్తు చేసుకోవాలని కోరారు. గత పాలకుల మాదిరి తమ పార్టీలోకి వస్తేనే ఇల్లు, పెన్షన్‌ ఇస్తామనే అంత దరిద్రపు ఆలోచనలు తమకు లేదన్నారు.

పార్టీలతో సంబంధం లేకుండా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందజేస్తామన్నారు. కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలు అమలుకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుందన్నారు. కాంగ్రెస్ పార్టీ పేదలకు ఇచ్చే పథకాలు అమలు కాకుండా ఉంటే బాగుండని బీఆర్‌ఎస్‌ పగటి కలలు కంటుందన్నారు. తొమ్మిదేళ్లలో ఒక్కరికి కూడా రేషన్‌కార్డు ఇవ్వని ఘనత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానిదని పేర్కొన్నారు. పేదలకు పంచిన భూములను గత ప్రభుత్వం లాక్కుందనీ మండిపడ్డారు. ప్రతీ డివిజన్ లో కౌంటర్‌ ఉంటుందన్నారు. ఈనెల ఆరో తేదీ వరకు దరఖాస్తులను స్వీకరిస్తారని తెలిపారు. అవసరమైతే దీన్ని ఇంకా పొడిగిస్తాం లేదా నిరంతర ప్రక్రియగా చేస్తామన్నారు. నిజామాబాద్ అర్బన్ లో ఇప్పటివరకు ఒక లక్ష దరఖాస్తు ఫారాలు అందించాం.. అందులో ఇప్పటి వరకు 86వేల దరఖాస్తులు స్వీకరించబడ్డాయన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement