Tuesday, November 26, 2024

bodhan: రైతులను మోసం చేసిన రాంబాబుపై చర్యలు తీసుకోవాలి

నిజామాబాద్ జిల్లా బోధన్ మండల సమీపంలో రైస్ మిల్ వ్యాపారి రైతులకు 50కోట్ల రూపాయలు ఎగనామం పెట్టడంతో శనివారం రైతులు రైస్ మిల్ ఎదురుగా ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. గన్ పూర్ ఎక్స్ రోడ్ వద్ద గల బాల గణపతి ఆగ్రో ఇండస్ట్రీస్ యజమాని వత్తికొండ రాంబాబు 2014-15 సీజన్లో రైతుల వద్ద నుండి భారీగా ధాన్యం కొనుగోలు చేశారు.అప్పటి నుండి రైతులకు అప్పుడిస్తా.. ఇప్పుడు ఇస్తానంటూ రైతులకు డబ్బు చెల్లించలేదు. ఇప్పటికే ఈ విషయాన్ని ఎన్నోమార్లు అధికార యంత్రాంగానికి, ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లామని అయినా ఫలితం దక్కలేదని బాధిత రైతులు తమ ఆవేదనను రహదారిపై వెళ్లగక్కారు. ఆనాడే సుమారు 50కోట్ల పైబడి రైతులకు, రైస్ మిల్లర్ చెల్లించాల్సిందని వర్ని మండల మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు గోపాల్ తెలిపారు.

రైతులు ఆపదలో ఇరుక్కోవడంతో తమకు ఎంతో కొంత డబ్బు చెల్లించి ఆదుకోవాలని రైస్ మిల్ యాజమాన్యంను వేడుకున్నప్పటికీ కనికరించలేదని రైతన్నలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు బాకీ ఉన్న డబ్బులు చెల్లించాలని ఇంటికి వెళ్లిన రైతులపై తన భార్యతో కేసులు చేయించారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రాంబాబును నమ్ముకున్న రైతులు ఎంతోమంది అప్పులపాలై, అనారోగ్యానికి గురై కొంతమంది మృత్యువాత కు గురయ్యారని రైతన్నలు తెలిపారు. ఇప్పటికైనా రైతులను మోసం చేసిన రాంబాబుపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు ముక్తకంఠంతో నినదించారు. బోధన్ పోలీసులు రైతులను సముదాయించి రాస్తారోకోను విరమింపజేశారు. బోధన్ – బాన్సువాడ రహదారిపై సుమారు గంటసేపు రైతులు తమ నిరసన వ్యక్తం చేశారు. ప్రయాణికులు సైతం తీవ్ర ఇబ్బందులకు లోనయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement