Friday, November 22, 2024

ఎస్టీఓ కార్యాలయంలో పర్సెంటేజీల పర్వం.. పట్టించుకోని అధికారులు

మద్నూర్ : మండల కేంద్రంలోని ఎస్టీ ఓ కార్యాలయంలో జోరుగా అక్రమ వసూళ్ల దందా కొనసాగుతోందని మండలంలోని ప్రజలు వాపోతున్నారు. ఇక్కడున్న అధికారులు ఎవరికి వారే యమునా తీరేలా మారి సెక్షన్ల పరంగా అక్రమ బిల్లులు నిర్వహిస్తూ బిల్లులపై పర్సంటేజీలు మాట్లాడుకుంటూ భారీ అక్రమాలకు పాల్పడుతూ వీరి వ్యవహారం యథేచ్ఛగా కొనసాగిస్తున్నారని మండలంలో చర్చనీయాంశంగా మారింది. డబ్బులు ఇవ్వని వారి ఫైళ్లు పక్కన పడేస్తున్నట్లుగా విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ ఆయా శాఖల బిల్లులపై లక్షకు వెయ్యి రూపాయల చొప్పున ఎన్ని లక్షల బిల్లులు ఉంటే అన్ని వెయ్యి రూపాయలు అక్రమాలకు పాల్పడుతూ ఎంత పాత బిల్లులు ఉన్నప్పటికీ ముడుపుల మత్తులో బిల్లును ఆపకుండా చేస్తున్నట్లుగా విశ్వసనీయ సమాచారం. మండల కేంద్రానికి చెందిన ఎస్టీ ఓ కార్యాలయం ఆధ్వర్యంలో జుక్కల్, పిట్లం, కొడప్గల్, మద్నూర్ మండలాలు ఉన్నాయి. ఈ నాలుగు మండలాల్లో ప్రభుత్వ ప్రత్యేక శాఖల బిల్లుల తోపాటు గ్రామ పంచాయతీ ఇతర గుత్తేదారుల భవనాల బిల్లులు సైతం లక్షల నుండి కోట్లలో ఉంటుంది. కనీసం లక్షకు వెయ్యి రూపాయల పర్సెంటేజీ చొప్పున పట్టుకున్నా ఇక్కడున్న అధికారుల అక్రమ సంపాదన లక్షల్లో ఉంటుందని ఆ ప్రాంత ప్రజలు ఆరోపిస్తున్నారు. డబ్బులు ఇస్తేనే ఫైలు కదులుతుందన్న చందంగా ఇక్కడున్న పరిస్థితి. అధికారులు కార్యాలయంలో ఓ ప్రైవేట్ వ్యక్తిని ఏర్పాటు చేసుకుని ఆయన ద్వారా పర్సెంటేజీల డబ్బులు పుచ్చుకుంటారని విశ్వసనీయ సమాచారం. గత నెల రోజుల క్రితం మండల కేంద్రానికి చెందిన ఓ అధికారి ఆయన బిల్లుపై కార్యాలయం సిబ్బంది పదివేల రూపాయలు డిమాండ్ చేసినట్లుగా మండల కేంద్రంలో చర్చలు కొనసాగుతున్నాయి. గత మార్చి నెలలో అధికారులు ప్రత్యేక ఐటీ బిల్లులపై రెండువేల నుంచి ఐదువేల వరకు నాలుగు మండలాల ఆయా శాఖ‌లు గల అధికారుల వద్ద లక్షలాది రూపాయలు అక్రమ వసూళ్లకు పాల్పడినట్లుగా మండలంలో చర్చనీయాంశంగా మారింది. ఇక్కడ జరుగుతున్న అక్రమాలపై సంబంధిత పై అధికారులు ముడుపుల మత్తులో మునిగి పట్టించుకొనకపోవడంఫై పలువురు ప్రజల్లో అనుమానాలు వ్యక్తమ‌వుతున్నాయి. అధికారులు గోప్యంగా పర్యవేక్షణ నిర్వహిస్తే అధికారుల అక్రమాలు వెలుగులోకి రాక తప్పవని ప్రజలు వాపోతున్నారు. ఇంత జరుగుతున్నప్పటికీ అధికారుల్లో ఎలాంటి చలనం లేకపోవడం విశేషం. అక్రమాల పట్ల కథనాలు వచ్చినప్పుడల్లా జిల్లా స్థాయి అధికారులు మండల కేంద్రానికి పర్యవేక్షణ సందర్భంగా వచ్చి నామమాత్రానికి తనిఖీలు నిర్వహిస్తూ మండల స్థాయి అధికారుల వద్ద భారీ ముడుపులు పుచ్చుకుని జిల్లా స్థాయి అధికారులు సైతం భారీ అక్రమాలకు పాల్పడుతూ చుక్క ముక్కలతో సరిపెట్టుకుని మండల స్థాయి అధికారులకు వత్తాసు పలుకుతూ ఎలాంటి చర్యలు తీసుకోవ‌డం లేద‌ని మండలంలో చర్చనీయాంశంగా మారింది. దీంతో మండల స్థాయి అధికారుల ఆగడాలకు హద్దు మించిపోయింది. ఇరువురు అధికారులు కలిసి మూడు పూవులు ఆరుకాయలుగా మారి భారీ అక్రమాలకు పాల్పడుతున్నారని మండల ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత పై అధికారులు మారి అక్రమాలకు పాల్పడుతున్నటువంటి మండల స్థాయి అధికారులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాల‌ని ప్రజలు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement