మద్నూరు (కామారెడ్డి) : గత నెల రోజులనుండి న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోరుతూ సమ్మె చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదని తెలంగాణ ప్రభుత్వ వైఖరికి నిరసనగా శనివారం మద్నూర్ మండల కేంద్రంలో గ్రామపంచాయతీ పారిశుధ్య కార్మికులు సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపారు. తమందరికీ ఉద్యోగ భద్రత, పీఎఫ్, ఈఎస్ఐ, కనీస వేతనం మేజర్ గ్రామపంచాయతీలకు రూ.25వేలు, చిన్న గ్రామపంచాయతీల కార్మికులకు రూ.19500 కల్పించాలని కోరుతూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పంచాయితీ కార్మికుల సమస్యలు పరిష్కరించకుంటే ప్రాణత్యాగాలకైనా సిద్దమని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోకి ఆయా మండలాల్లో గత నెల రోజులుగా పంచాయితీ కార్మికులు నిరవధిక సమ్మె చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం తమ సమస్య పరిష్కారంపై ఏమాత్రం పట్టించుకోవడం లేదని తెలంగాణ ప్రభుత్వ వైఖరిని నిరసనగా శనివారం మద్నూర్ మండల కేంద్రం లోని సెల్ టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. తమ సమస్యల పై ప్రభుత్వం నుండి స్పష్టమైన హామీ వచ్చే వరకు తాము సెల్ టవర్ దిగే ప్రసక్తే లేదని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సెల్ టవర్ వద్దకు చేరుకొని గ్రామపంచాయతీ పారిశుధ్య కార్మికులను సెల్ టవర్ నుండి కిందికి దిగాలని, ఏవైనా సమస్యలు ఉంటే ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరించుకునే విధంగా చేసుకోవాలన్నారు. ఈ సందర్బంగా పంచాయితీ కార్మికురాలు మాట్లాడుతూ… కంపుకొట్టే మురికి కాలువలు, పాచి పనులను శుభ్రపరిచే తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తమకు సమాజంలో గుర్తింపులేదని, పెద్ద గ్రామ పంచాయితీ కార్మికులకు రూ.25 వేల వేతనం, చిన్న గ్రామ పంచాయితీ కార్మికులకు 19,500 రూపాయల వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ భద్రత, పీఎఫ్, ఈఎస్ఐ, కనీస వేతనం 19500 రూపాయల వేతనం కల్పించాలని డిమాండ్ చేశారు. పంచాయితీ కార్మికుల సమస్యలను పరిష్కరించకుంటే ప్రాణత్యాగానికైనా వెనుకాడబోమని తెలిపారు.