Saturday, November 23, 2024

ప్రజల దగ్గరకు వెళ్లే హక్కు ఒక్క బిఆర్ఎస్ పార్టీకే ఉంది.. సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి

ప్రజల దగ్గరకు వెళ్లే హక్కు ఒక్క బిఆర్ఎస్ పార్టీకే ఉందని సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గం వర్ని మండల కేంద్రంలోని వడ్డేపల్లి లో రూ.60 లక్షలతో నిర్మించిన జనరల్ ఫంక్షన్ హాల్ ను సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. కులమతాలతో సంబంధం లేకుండా నిరుపేదల కోసమే జనరల్ ఫంక్షన్ హాల్ నిర్మించినట్లు స్పీకర్ తెలియజేశారు. నియోజకవర్గంలో మొత్తం 100 ఫంక్షన్ హాల్ లు నిర్మిస్తున్నట్లు అందులో కొన్ని పూర్తయి ప్రారంభం చేసుకున్నామని, మరికొన్ని నిర్మాణంలో ఉన్నాయని స్పీకర్ వెల్లడించారు.

దేశంలో, ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా కళ్యాణ లక్ష్మి, రైతుబంధు, రైతు బీమా, కేసీఆర్ కిట్, రైతులకు 24 గంటల ఉచిత కరెంటు, పెన్షన్లు, డబల్ బెడ్ రూమ్ ఇండ్లు లాంటి ఎన్నో పథకాలు తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్నాయని సభాపతి పేర్కొన్నారు. దేశంలోనే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఇస్తున్న ఒకే ఒక వ్యక్తి సీఎం కేసీఆర్ అని, ఇప్పటివరకు రాష్ట్రంలో 13 లక్షల మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసినట్లు స్పీకర్ వెల్లడించారు. బిఆర్ఎస్ ప్రభుత్వం నిరుపేదలకు నిర్మించి ఇచ్చే ఇండ్లకు ఒక లెక్క ఉందని, కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో నిర్మించిన ఇండ్ల జాడేదని సభాపతి ప్రశ్నించారు.

అభివృద్ధి పేరుతో దోచుకున్నది ఒక పార్టీ అయితే, కుల మతాల పేరుతో ప్రజల మధ్య చిచ్చులు పెట్టేది మరో పార్టీ అని సభాపతి అన్నారు. కొంతమంది మతి లేకుండా అభివృద్ధి మేమే చేస్తున్నామని చెప్పుకుంటున్నారని అభివృద్ధి ఎవరు చేస్తున్నారో ప్రజలకు తెలుసని సభాపతి అన్నారు. ప్రజలు పండ్ల చెట్టును పెంచుకోవాలి కానీ ముండ్ల చెట్టును కాదని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement