నిజామాబాద్ ప్రతినిధి, (ప్రభ న్యూస్) : భోజనంలో బొద్దింక ఘటన నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ హోటల్లో చోటుచేసుకుంది. ఎలాంటి నాణ్యతా ప్రమాణాలు లేకుండా అపరిశుభ్ర వాతావరణంలో రెస్టారెంట్లు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి.
నగరంలోని కార్పొరేషన్ కార్యాలయం ఎదురుగా ఉన్న సాయి మోక్ష హోటల్లో (ఆదివారం) భోజనం చేసేందుకు వచ్చిన ఓ వినియోగదారుడు భోజనంలో బొద్దింక కనిపించడంతో అవాక్కయ్యారు. ఈ విషయమై వెంటనే కార్పొరేషన్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన కమిషనర్ ఆదేశాల మేరకు శానిటరీ ఇన్ స్పెక్టర్, మున్సిపల్ అధికారులు మోక్ష హోటల్ లో ఆహారాన్ని పరిశీలించారు.
ఆహారంలో బొద్దింక ఉందని నిర్ధారించుకుని హోటల్ యాజమాన్యానికి నోటీసులిచ్చి రూ.5 వేలు జరిమానా విధించారు. హోటల్ పరిసరాలు, తినుబండారాలను పరిశుభ్రంగా ఉంచాలని, ఆహార పదార్థాలు నిల్వ ఉంచే గిన్నెలపై మూతలు పెట్టాలని, నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పరిశుభ్రమైన వాతావరణంలో ఆహార పదార్థాలు అందించాలని హెచ్చరించారు. బాధితుడు కమీషనర్‌కు ఫిర్యాదు చేయడంతో కమిషనర్ ప్రత్యేక చర్యలు చేపట్టడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.