Tuesday, November 26, 2024

ఉత్తర తెలంగాణ వర ప్రదాయిని ఎస్సారెస్పీ : మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి

బాల్కొండ : ఉత్త‌ర తెలంగాణ వ‌ర ప్ర‌దాయిని ఎస్సీరెస్పీ అని, కేసీఆర్‌లో తెలంగాణ ఉద్యమకాంక్ష కట్టలు తెంచుకుంది ఎస్సారెస్పీ కట్టపైనేనని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్ గేట్ల మరమ్మతు పనులను ఆదివారం ఆయన ప్రారంభించారు. సుమారు రూ.17.40 కోట్ల వ్యయంతో చేపట్టే పనులను కొబ్బరికాయ కొట్టి శ్రీకారం చుట్టారు. అనంతరం డ్యామ్‌ కట్టపై అధికారులు, రైతులతో కలిసి కలియతిరిగారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. ఉత్తర తెలంగాణ వర ప్రదాయిని అయిన ఎస్సారెస్పీ సందర్శనకు 1996లో కేసీఆర్‌ వచ్చారని, అప్పుడు తుప్పు పట్టిన గేట్లను, డ్యామ్‌పై గుంతలు,సేఫ్టీ వాల్, డ్యామ్‌ కట్ట బలంగా ఉండే రాళ్లు అస్తవ్యస్తంగా ఉండడాన్ని చూసి, ఆంధ్ర ప్రాజెక్టులు వైష్ణవ ఆలయాలు, తెలంగాణ ప్రాజెక్టులు శివాలయాల తీరు ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారని చెప్పారు. కట్టలు తెంచుకున్న ఆవేశంతో 1996లోనే తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం మొదలు పెట్టాలని ఆలోచన చేశారన్నారు. కేసీఆర్‌ ఏ నిర్ణయం తీసుకున్న లోతైన ఆలోచన, క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తర్వాతే ప్రారంభిస్తారన్నారు. ముఖ్యమంత్రి దయతో నేడు రూ.17.40 కోట్ల వ్యయంతో గేట్లు మరమ్మతులు చేసుకుంటున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఎస్సారెస్పీ సీఈ సుధాకర్ రెడ్డి, ఎస్‌ఈ శ్రీనివాస్, ఈఈ బాల్కొండ నియోజకవర్గ ఆయకట్టు మండలాల ప్రజాప్రతినిధులు, రైతులు, నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement