Thursday, September 19, 2024

NZB : తీజ్ ఉత్సవాలను విజయవంతం చేయండి..

నిజామాబాద్ ప్రతినిధి, ఆగస్టు 1(ప్రభ న్యూస్) : గిరిజనులు అత్యంత పవిత్రంగా నిర్వహించే తీజ్ ఉత్సవాలను విజయవంతం చేయాలని తీజ్ కమిటీ తెలిపారు. బుధవారం నిజాంబాద్ జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తీజ్ కమిటీ సభ్యులు మాట్లాడారు. బంజారా, లంబాడీ సంస్కృతి, సాంప్రదాయానికి చాటి చెప్పే పండుగల్లో అతి ముఖ్యమైనది తీజ్ పండుగ అని అన్నారు. వర్షాకాలం ఎర్రని ఆరుద్ర పురుగు వచ్చే సమయానికి ఈ పండుగ జరుపుతారని తెలిపారు. తీజ్ అనగా గోదుమ మొలకలు అని అర్థమన్నారు. ఈ పండుగను పెళ్ళి కాని అమ్మాయిలు శ్రావణ మాసంలో భక్తి శ్రద్ధలతో 9 రోజులు అత్యంత వైభవంగా జరుపుకుంటారని వివరించారు.

నిజామాబాద్ నగరంలోని పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో ఈనెల 3 నుంచి 11వ తేదీ తీజ్ కమిటీ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తామని తెలిపారు. కాలం మారుతున్నా లంబాడీలు మాత్రం తమ సంస్కృతిని, సంప్రదాయాన్ని కాపాడుకుంటూ వస్తున్నారని తెలిపారు. తీజ్ పండుగలో కఠోర నియమాలు, డప్పుల మోతలు, కేరింతలు, ఆటపాటలు, నృత్యాలు, అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల అనుబంధాలు, బావామరదళ్ల అల్లరి చేష్టలు ఉంటాయి. తొమ్మిది రోజుల పాటు వేడుకలు జరుగుతాయన్నారు. గోధుమ మొక్కలను ఎనిమిది రోజులపాటు పూజించి తొమ్మిదవ రోజు నిమజ్ఞనం చేస్తారని తెలిపారు.

ఈ ఉత్సవాలను పెళ్లి కాని ఆడ పిల్లలే నిర్వహిస్తారన్నారు. ఈనెల 3న తీజ్ ఉత్సవాలను ప్రారంభించి 11వ తేదీన పాలిటెక్నిక్ కళాశాల మైదానం నుంచి భారీ ర్యాలీగా పాత కలెక్టరేట్ వరకు నిర్వహిస్తామని తీజ్ కమిటీ తెలిపారు. ప్రస్తుత ఆధునిక యుగంలో సంస్కృతి, సాంప్రదాయాలు కనుమరుగు కాకుండా నిజామాబాద్ జిల్లాలోని వైద్య, పోలీస్, అన్ని శాఖలలోని గిరిజనులు అధిక సంఖ్యలో పాల్గొని తీజ్ ఉత్సవాలను విజయవంతం చేయాలని తీజ్ కమిటీ కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ చాంగు భాయ్, డాక్టర్ సులోచన, డాక్టర్ చంద్రకళ, డాక్టర్ హరికృష్ణ, డాక్టర్ మోతిలాల్, డాక్టర్ బిలోజి నాయక్, బలరాం నాయక్, ప్రియా, శంకర్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement