Saturday, November 23, 2024

ఆర్మీ ఉద్యోగాలకు మంగళం పాడేందుకు అగ్నిపథ్ : మంత్రి హరీష్ రావు

నిజామాబాద్: ఆర్మీ ఉద్యోగాలకు మంగళం పాడేందుకే కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ పథకాన్ని ప్రవేశపెట్టిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య , ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ఆక్షేపించారు. కేంద్రం తెచ్చిన ఈ అసంబద్ధ పథకం వల్లే దేశవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు ఎగసిపడుతున్నాయని అన్నారు. శనివారం నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం పరిధిలోని వేల్పూర్, భీంగల్, మోర్తాడ్ మండలాల్లో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల్లో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో కలిసి హరీశ్ రావు ప్రారంభోత్సవాలు, శంఖుస్థాపనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేల్పూర్ మండలం మోతె గ్రామంలో బహిరంగ సభలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ, కేంద్రం పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. విశాఖ ఉక్కు, జీవిత బీమా సంస్థల తరహాలోనే రక్షణ రంగంలోనూ కేంద్రం ప్రైవేటీకరణను ప్రోత్సహిస్తోందని అన్నారు. దీనిని వ్యతిరేకిస్తూ సికింద్రాబాదులో యువత ఆందోళనకు దిగిన సందర్భంగా జరిగిన కాల్పుల్లో ఓ యువకుడు మృతి చెందడం దురదృష్టకరమన్నారు. ఈ అల్లర్ల వెనుక టీఆర్ఎస్ హస్తం ఉందని బీజేపీ నాయకులు పేర్కొనడం సిగ్గుచేటని హరీష్ రావు విమర్శించారు. సికింద్రాబాద్ లో ఆందోళన వెనుక టీఆర్ఎస్ పార్టీ ప్రమేయం ఉంటే, మరి బీహార్, ఉత్తరప్రదేశ్ లో జరిగిన అల్లర్ల వెనుక నితీష్ , యోగి ఆదిత్యనాథ్ ల హస్తం ఉందా అని ప్రశ్నించారు. అగ్నిపథ్ కు వ్యతిరేకంగా యువత ఆందోళనకు దిగితే, ఈ పథకాన్ని వారు సరిగా అర్థం చేసుకోలేదు అంటూ కేంద్రం బుకాయించే ప్రయత్నం చేస్తోందని దుయ్యబట్టారు. సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలని భావిస్తున్న యువతకు, నాలుగేళ్ల తర్వాత ఆర్మీ ఉద్యోగం నుంచి తొలగిస్తే వారి భవిష్యత్తు ఏం కావాలని హరీష్ రావు కేంద్రాన్ని సూటిగా ప్రశ్నించారు. కర్ణాటక, ఉత్తరప్రదేశ్ ,ఆంధ్రప్రదేశ్ లోని సాగునీటి ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించిన కేంద్రం.. తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టుకు మొండి చేయి చూపి మన రాష్ట్రం పట్ల వివక్ష ప్రదర్శిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో అమలవుతున్న రెండు వేల రూపాయల పెన్షన్, సేద్యానికి 24 గంటల విద్యుత్, ఇంటింటికి రక్షిత మంచి నీరు, రైతు బంధు, దళిత బంధు వంటి ఏ ఒక్క పథకం కూడా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మచ్చుకైనా కానరావని అన్నారు. ప్రజలు వాస్తవాలను గుర్తించి సంక్షేమాభివృద్ధి పాటుపడే తెరాసకు మద్దతుగా నిలవాలని మంత్రి హరీష్ రావు విజ్ఞప్తి చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement