నిజామాబాద్ (ప్రభ న్యూస్) : మంత్రాలు చేస్తున్నదని అనుమానించి బోనికే భారతిని హత్య చేసిన నలుగురికి జీవిత కారాగార శిక్ష విధిస్తు నిజామాబాద్ సేషన్స్ జడ్జి సునీత కుంచాల శుక్రవారం తీర్పు వెలువరించారు. తీర్పులోని వివరాలు.. ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లి వెంకటేశ్వర కాలనికి చెందిన భారతి… మంత్రాలు చేసి తనను అనారోగ్యం పాలుచేస్తున్నదని అదే కాలనికి చెందిన తోకల చిత్ర అనుమానపడేది. దీంతో తన బందువైన జక్రాన్ పల్లి మండలం బ్రహ్మణపల్లి గ్రామానికి చెందిన బట్టు వెంకటేష్ కు.. భారతి మంత్రాలు చేసి తనను అనారోగ్యం బారిన పడేట్టు చేస్తున్నదని తన బాధను వ్యక్తం చేసేది.
దీంతో తన పిన్ని (చిత్రం)పై మంత్రాలు వేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్న భారతిని చంపేయాలని.. తన పిన్ని, స్నేహితులు పండ్లర్ రాజేందర్ గౌడ్, బట్టు రంజిత్‌లతో కలిసి ప్లాన్ చేశాడు బట్టు వెంకటేష్. 8 జూలై, 2018న మద్యం సేవించి అర్ధరాత్రి సమయంలో భారతి ఇంటిలోకి గోడ దూకి వెళ్లి ఇంట్లో టి.వి చూస్తున్న ఆమెను వెనుక నుండి రాజేందర్ తోసివేయగా.. కింద పడిపోయిన ఆమె కాళ్లు వెంకటేష్ పట్టుకొనగా, తలను రంజిత్ పట్టుకున్నాడు. అంతలోనే రాజేందర్ తనవెంట తెచ్చుకున్న కత్తితో ఆమె గొంతుకోసి చంపేశాడు. ఆమె చనిపోయిందని నిర్దారించుకుని, ఇంట్లోని బంగారు ఆభరణాలు తీసుకెళ్లారు. ఆ తరువాత దొంగతనం చేసినట్లు నేరస్థలంలో సాక్షులను చేరిపి వేశారు.
సెషన్స్ కోర్టు క్రిమినల్ విచారణలో మొత్తం 14 మంది ప్రత్యక్ష సాక్షులను విచారించి వారి వాంగ్మూలాలను నమోదు చేశారు. 32 దృవీకరణ పత్రాలు, 18 ఆబ్జెక్టివ్ సాక్షులను పరిశీలించి, ప్రాసిక్యూషన్, డిఫెన్స్ న్యాయవాదుల వాదనలు విన్న కోర్టు… సాక్ష్యాధారాలను అధ్యయనం చేసి ముద్దాయిలపై హత్య నేరంతో పాటు సాక్ష్యాలను చేరిపివేసిన నేరం రుజువయినట్లు కోర్టు పేర్కొంది. హత్య కేసులో నిందితులకు జీవిత ఖైదు, సాక్ష్యాలను చేరిపి వేసిన నేరంకుగాను ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. రెండు నేరాలకుగాను వేయి రూపాయల జరిమాన విధించారు. పోలీసుల తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ పిడుగు రవిరాజ్ ప్రాసిక్యూషన్ నిర్వహించారు.