నిజామాబాద్ ప్రతినిధి, ఏప్రిల్ 6(ప్రభ న్యూస్): రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 117 రోజులు దాటినా రైతు సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. రైతు సంక్షేమానికై సర్కారుపై పిడికిలి బిగించి కొట్లాడుదామని పిలుపునిచ్చారు. వరికి క్వింటాల్ కు అదనంగా రూ.500 బోనస్ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. శనివారం జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతుల కోసం పోరుబాట పట్టారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్ లో నిరసన చేపట్టారు. ఎన్నికల సమ యంలో రైతులకిచ్చిన హామీల అమలును కాంగ్రెస్ ప్రభుత్వం మరిచిందని, నిజామాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ రూ. రెండు లక్షల రుణమాఫీ, క్వింటాలుకు రూ.500 బోనస్, ఎకరానికి రూ.15వేల రైతు బంధు ఇస్తామని హామీ ఇచ్చిందన్నారు. అబద్ధపు హామీలిచ్చి కాంగ్రెస్ రైతులను మోసం చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం, నిర్వహణలోపం కారణంగా రాష్ట్రవ్యాప్తంగా పంటలు ఎండి తీవ్ర ఇబ్బందులు పడుతున్న రైతుల కష్టాలను క్షేత్రస్థాయిలో తెలుసుకునేందుకు అధికారులను నియమించి అంచనా విలువ వేయాలని డిమాండ్ చేశారు.
ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం వరికి క్వింటాలుకు అదనంగా రూ.500 రూపాయల బోనస్ ఇవ్వాలన్నారు. వడగండ్ల వానతో పంట నష్టపోయిన రైతులకు పంట నష్ట పరిహారం ఇవ్వాలని కోరుతూ ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు, మాజీ ఎమ్మెల్సీ వీజీగౌడ్, జడ్పీటీసీ యువ నాయకులు బాజిరెడ్డి జగన్, బీఆర్ఎస్ నగరాధ్యక్షుడు సిర్పరాజు, వివిధ మండలాల నుండి జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీలు, సర్పంచులు, ఉప సర్పంచులు, ముఖ్యంగా రైతు సోదరులు, బీఆర్ఎస్ పార్టీ అన్ని అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు, తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.