నిజామాబాద్ సిటీ, జూలై 1 (ప్రభ న్యూస్) : భారత న్యాయవ్యవస్థలో మేధో సంపత్తి కలిగిన న్యాయవాదులకు కొదువలేదని, న్యాయవాద వృత్తి ఉన్నతమైనదని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల అన్నారు. న్యాయవ్యవస్థ తో పాటు రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాల్లో ఎందరో మహానుభావులు దేశ ప్రగతి నిర్మాణానికి పునాదులు వేసిన న్యాయవాదులున్నారని తెలిపారు. నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం జిల్లా కోర్టు ప్రాంగణంలోని సమావేశపు హాల్ లో న్యాయవాద వృత్తి, వృత్తి పరమైన నీతి అనే అంశంపై నిర్వహించిన సెమినార్ లో ఆమె న్యాయవాదులను ఉద్దేశించి ప్రసంగించారు. చట్టాలను నిరంతర అధ్యయనం చేయాలని నూతన చట్టాలను తెలుసుకోవాలని ఆమె అన్నారు.
జూనియర్ న్యాయవాదులు తమ సీనియర్ న్యాయవాదుల వద్ద ఎన్నో చట్ట సంబంధిత విషయ పరిజ్ఞానం నేర్చుకోవాలని సూచించారు. న్యాయ స్థానాలతో పాటు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో వృత్తిపరమైన అవకాశాలున్నాయన్నారు. ఆంగ్లంలో అనర్గళమైన పరిజ్ఞానం, బాషపై పట్టు సాధించాలని పేర్కొన్నారు. వృత్తిలోని గొప్పతనాన్ని కాపాడుకోవాలని ఉద్భోదించారు. న్యాయవాద వృత్తి నుండి దేశ ప్రధాన మంత్రులు, మంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు అయిన చరిత్ర ఉన్నదని తెలిపారు. స్వతంత్ర న్యాయ వ్యవస్థలోని ఉన్నత న్యాయస్థానం న్యాయమూర్తులు దేశానికి వెలుగురేకులుగా నిలుస్తూ ప్రజాస్వామ్య సౌధానికి ఒక ప్రధాన రక్షకులుగా నిలుస్తున్న వర్తమాన చరిత్ర మనముందు ఉన్నదని వివరించారు. బార్ అధ్యక్షుడు దేవదాస్, ప్రధాన కార్యదర్శి భాగి చరణ్ ప్రసంగిస్తూ ముఖ్యంగా జూనియర్ ఎం న్యాయవాదులకు న్యాయ సంబంధిత విషయ పరిజ్ఞానాన్ని విస్తృతం చేయాలనే సంకల్పంతో సెమినార్ కు శ్రీకారం చుట్టినట్టు తెలిపారు.