కొత్తపల్లి : ఓ రైతు నుంచి ఉపాధి హామీ పథకం ఏపీవో లంచం తీసుకుంటూ పట్టుబడిన ఘటన కర్నూలు జిల్లాలోని కొత్తపల్లి మండలంలో చోటుచేసుకుంది. కొత్తపల్లి మండల ఉపాధి హమీ పథకం ఏపీవో మద్దిలేటి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. కొత్తపల్లిలో మంగళవారం ఏసీబీ అధికారులు దాడులు చేశారు. మండలంలోని వీరాపురం గ్రామానికి చెందిన రాధాకృష్ణ అనే రైతుకు చెందిన మంజూరైన సెరికల్చర్ షెడ్డు నిర్మాణానికి రూ.15వేలు లంచం డిమాండ్ చేయగా… ఈనెల 23న ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 14400కు ఫిర్యాదు చేశాడు.
ఈ మేరకు కర్నూలు ఏసీబీ డిఎస్పీ శివనారాయణస్వామి, సీఐలు తేజేశ్వరరావు, కృష్ణారెడ్డి, ముంతాజ్ బాష, ఎస్ఐ వెంకట్ తమ సిబ్బందితో రైతు రాధాకృష్ణ ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దాడులు నిర్వహించారు. కొత్తపల్లి ఉపాధి హమీ పథకం కార్యాలయంలో ఏపీవో మద్దిలేటి రైతు రాధాకృష్ణ నుంచి రూ.15వేలు తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు రెడ్ హ్యండెడ్ గా పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ శివనారాయణస్వామి మాట్లాడుతూ… ప్రభుత్వ కార్యాలయాల్లో లంచం డిమాండ్ చేస్తే వెంటనే టోల్ ఫ్రీ నెంబరుకు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..