Monday, November 25, 2024

TS | సిరికొండకు ఐటీఐ కాలేజ్ మంజూరు.. త్వరలోనే పనులు ప్రారంభం

సిరికొండ (ప్రభ న్యూస్): నిజామాబాదు జిల్లా సిరికొండ మండల కేంద్రానికి ఐటీఐ కాలేజి మంజూరైనట్లు టిఎస్ ఆర్టీసీ చేర్మెన్, నిజామాబాదు రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ వెల్లడించారు. గురువారం సిరికొండ ఎంపీడీఓ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి చెక్కులను 18 మంది లబ్దిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను 19 మందికి పంపిణి చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే గోవర్ధన్ మాట్లాడుతూ.. సిరికొండ మండల ప్రజల చిరకాల వాంఛ ఐటీఐ కాలేజిని మంజూరు చేస్తూ ప్రభుత్వం రూ.5 కోట్ల నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారి చేసిందని గోవర్ధన్ చెప్పారు.

బొడ్డుమామిడి చెరువు వద్ద ఐటీఐ కాలేజి ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్మెల్యే గోవర్ధన్ వెల్కదించారు. అలాగే ధర్పల్లిలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. త్వరలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి చేతుల మీదుగా పనులు ప్రారంభిస్తామని తెలిపారు. చీమన్ పల్లి గ్రామానికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మంజూరు అయ్యింది భవన నిర్మాణానికి రెండు కోట్ల రూపాయల నిధులు కూడ మంజూరైనట్లు అన్నారు. నిజామాబాదు రూరల్ పరిధిలోని తాండలలో రోడ్ల నిర్మాణానికి ట్రైబల్ వెల్ఫేర్ శాఖ నుంచి రూ.50 కోట్ల నిధులు మంజూరైనట్లు వెల్లడించారు.

సిరికొండ మండలంలో నూతన గ్రామ పంచాయతీలుగ ఏర్పడ్డ తాండలలో మూడు మినహా మిగిత గ్రామ పంచాయతి భవనాల నిర్మాణానికి నిధులు మంజూరై పనులు కూడ ప్రారంభించినట్లు ఎమ్మెల్యే చెప్పారు. గడ్కోల్ గ్రామం వద్ద కప్పల వాగు పై వంతెన నిర్మాణానికి రూ.13 కోట్లు, చెక్ డ్యాం నిర్మాణానికి రూ.2 కోట్లు, కొండూర్ వద్ద చెక్ డ్యాం నిర్మాణానికి నిధులు మంజూరు అయినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. సిఎంఆర్ఎఫ్, కళ్యాణ లక్ష్మి,షాది ముబారక్,సంబంధించి జిల్లాలో ఏ నియోజకవర్గానికి మంజూరు చేయని నిధులు నిజామాబాదు రూరల్ నియోజకవర్గానికి మంజూరు చేయించినట్లు ఎమ్మెల్యే చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement